ఎంజీఎంలో సిబ్బంది కొరత వాస్తవమే
ఎంజీఎం: ‘ఎంజీఎంలో పరికరాలు, సిబ్బంది కొరతను గుర్తించాం. ఔషధాల బడ్జెట్ విడుదల జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) నరేంద్రకుమార్ అన్నారు. ఎంజీఎం రోగిని ఎలుకలు కొరిన ఘటన నేపథ్యంలో ఆదివారం ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని ఆర్‌ఐసీయూ, క్యాజువాలిటీ, ఎంఎంసీ, ఐఎంసీ, ఎస్‌ఎన్‌సీయూ విభాగాలు పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్యాజవాలిటీ రోగుల రద్దీకి సరిపడేలా లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. అత్యవసర విభాగాల్లో పరికరాలు, సిబ్బంది కొరత ఉందని, రోగులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఔషధాల బడ్జెట్ ఎప్పటికప్పుడు విడుదలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీ అడ్మిట్ అయిన రోగులను ఎందుకు రెఫరల్ చేస్తున్నారనే విషయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఎంజీఎం పరిపాలనాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆర్‌ఎంఓలకు ప్రత్యేక నంబర్లు కేటాయించి రోగులకు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడనున్నామన్నారు. ఎంజీఎం ఆస్పత్రికి సూపర్‌స్పెషాలిటీ వైద్యుల నియామకం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఆస్పత్రిలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అందుతున్న సేవలను ప్రత్యేకంగా పరిశీలించినట్లు తెలిపారు. వైద్యుల హాజరు శాతం మెరుగపర్చేలా చర్యలు చేపడతామని, ఆర్‌ఎంఓల నియామకం చేపడతామన్నారు. ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంఈ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, ఆర్‌ఎంఓ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.
● ఆర్‌ఎంఓల నియామకం చేపడతాం
● రెఫరల్ వైద్య సేవలపై ఆడిట్ చేపడతాం..
● వైద్య విద్య సంచాలకుడు నరేంద్రకుమార్


