పల్లెవించిన ఓటరు చైతన్యం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. మొత్తం 87.25% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. రెండో విడతలో భాగంగా ధర్మసాగర్ హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 1,25,735 ఓటర్లు ఉండగా.. 1,09,703 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 87.25గా పోలింగ్ శాతం నమోదైంది.
ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు..
రెండో విడత పోలింగ్‌కు జిల్లాలోని ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఓటర్లు ఉదయం నుంచే పోటెత్తారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ ప్రారంభానికి ముందే కేంద్రాల వద్ద బారులుదీరారు. ఓటు వేసేందుకు ఓపికతో క్యూ లైన్‌లో నిలబడ్డారు. ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ సాగింది. అనంతరం భోజన విరామం తర్వాత వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రెండో విడత పోలింగ్‌లో కూడా మహిళల పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. మొత్తం ఓటర్లు 1,25,735మంది ఉండగా, పురుషులు 54,274, మహిళలు 55,429 ఓటు హక్కు వినియోగించుకున్నారు. థర్డ్ జెండర్ కేటగిరీలో ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్ శాతం చూస్తే మాత్రం పురుషుల కంటే మహిళా ఓట్లు రెండు శాతం తక్కువగా పోలింగ్‌కు హాజరయ్యారు. తొలి విడత జిల్లాలో 83.95 పోలింగ్ శాతం నమోదవ్వగా రెండో విడతలో 87.25 శాతంగా పోలింగ్ నమోదైంది. దీంతో మొదటి విడత కంటే రెండో విడతలో సుమారు మూడు శాతం ఎక్కువ పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
పర్యవేక్షించిన కలెక్టర్
హనుమకొండ జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యవేక్షించారు. హసన్‌పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలను స్వయంగా సందర్శించి పోలింగ్ పరిశీలించి స్థానిక అధికారులకు సూచనలిచ్చారు.
వరంగల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు..
సాక్షి, వరంగల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన నల్లబెల్లి, దుగ్గొండి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 1,008 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. 1,36,191 మంది ఓటర్లకు 1,20,001 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన వలస ఓటర్లు పల్లెలకు భారీగా తరలివచ్చారు. తొలి విడత నమోదైన 86.52 శాతం కంటే ఈసారి 88.11 శాతం నమోదైంది. ఉదయం ఏడు నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. గీసుకొండ మండలం గీసుకొండ, గంగదేవిపల్లి, దుగ్గొండి మండలం వెంకటాపూర్, దేశాయిపల్లి, నల్లబెల్లి మండలం నల్లబెల్లి ఉన్నత పాఠశాల, నందిగామ, సంగెం మండలం సంగెం ఉన్నత పాఠశాల, మొండ్రాయిలో హరిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు లేక ఇబ్బందులు ఎదురవడం మినహా అంతా ప్రశాంతంగానే సాగింది.
మహిళా ఓటర్లు ఎక్కువ..
వినియోగించుకున్నది ఎక్కువ పురుషులే..
ఈ నాలుగు మండలాల్లో 66,427 మంది పురుషులుంటే 58,688 మంది, 69,722 మంది మహిళలుంటే 61,311 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే పురుషులు 88.30 శాతం వినియోగించుకుంటే మహిళలు కాస్త తక్కువగా 87.94 శాతం ఓటేశారు. అంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగంలో పురుషులే ముందున్నారు.
రెండో విడతలో హనుమకొండ జిల్లాలో 87.25 శాతం పోలింగ్
మొదటి విడత కన్నా 3.3 శాతం అధికం
పల్లెవించిన ఓటరు చైతన్యం
పల్లెవించిన ఓటరు చైతన్యం


