విద్యార్థుల ప్రగతికి అధునాతన సాంకేతిక సేవలు
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రగతి కోసం ఇంటర్ బోర్డు పలు అధునాతన సాంకేతిక సేవలను ప్రారంభించిందని వరంగల్ ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం గూగుల్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు పలు ఆధునిక సేవలను వివరించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు మెరుగుదల కోసం ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) ప్రారంభించినట్లు తెలిపారు. హాజరు విధానాన్ని అధునాతన సాంకేతిక పద్ధతిలో ఇంటర్ విద్యావిభాగం అవలంబిస్తోందని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా టైంటేబుల్, టీచింగ్ డైరీ నమోదుతో అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సాంకేతిక సంస్థలతో ఒప్పందం చేసుకొని ఆన్‌లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాశాలల్లో వసతుల మెరుగుదలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. గూగుల్ మీట్‌లో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
బైక్ దొంగల అరెస్ట్..
హసన్‌పర్తి: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు బైక్ దొంగలను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. వారి వద్ద నాలుగు ద్విచక్రవాహనాలతోపాటు మూడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు సోమవారం హసన్‌పర్తి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హసన్‌పర్తి ఎస్సై గోవర్ధన్ సీతంపేట క్రాస్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు పారిపోతుండగా గమనించారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన చోరీలను అంగీకరించారు. దీంతో కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన కలుగుల సాయిచంద్, రెడ్లమ్ రాకేశ్, గంపల సాయితేజాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చెప్పారు. వీరి వద్ద నుంచి ఒక బైక్‌తో పాటు మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
వాహనాలు తనిఖీ చేస్తుండగా...
సీతంపేటక్రాస్ వద్ద ఎస్సై దేవేందర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా కాజీపేట వైఎస్సార్ నగర్‌కు చెందిన ముద్దంగుల అనిల్ పోలీసులకు చిక్కాడు. దీంతో విచారించగా గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్‌స్పెక్టర్ చేరాలు, ఎస్సైలు గోవర్ధన్, దేవేందర్‌తోపాటు కానిస్టేబుల్ క్రాంతి, వెంకటస్వామిని ఏసీసీ అభినందించారు.ఈ సందర్భంగా నగదు పురస్కారం అందజేశారు.
డిసెంబర్ 13, 14న ఏపీఆర్జేసీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
నయీంనగర్ : డిసెంబర్ 13, 14న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (ఏపీఆర్జేసీ) నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నాగార్జునసాగర్ విజయపురి సౌత్‌లో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ఏపీఆర్జేసీ సాగర్ పరివార్ బాధ్యులు, కళాశాల పూర్వ విద్యార్థులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్, డాక్టర్ కన్నం నారాయణ, పరకాల ఆర్డీఓ, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మారెళ్ల అంజిరెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో గోల్డెన్ జూబ్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశంలో అత్యున్నత ఉద్యోగాలు చేసిన ఏపీఆర్జేసీ పూర్వ విద్యార్థులు, వివిధ దేశాల్లో సెటిల్ అయిన 5 వేల మంది పూర్వ విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ చంచల్ అగర్వాల్, స్వామి, డాక్టర్ రాజు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రగతికి అధునాతన సాంకేతిక సేవలు
విద్యార్థుల ప్రగతికి అధునాతన సాంకేతిక సేవలు


