మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
లక్ష్యం
వైపు
అడుగులు
సమ సమాజ సేవకు పోలీసులు పునరంకితం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర డీజీపీ క్షేత్రస్థాయిలో పోలీస్ కుటుంబాలను పరామర్శించి వారి సంక్షేమంపై సమీక్ష నిర్వహించాలని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
● ఎన్‌కౌంటర్లలో వీరమరణం పొందిన పోలీస్ అధికారుల కుటుంబాలను, రిటైర్డ్ సిబ్బంది కుటుంబాలను గ్రామాల్లో పెద్దలు, మహిళలు, విద్యార్థుల సమక్షంలో పూలమాలలతో గౌరవించాలి.
● వారి ఫొటోలను స్థానిక పోలీస్‌స్టేషన్లతో పాటు, విద్యాసంస్థల్లో ప్రదర్శించాలి.
● అవకాశం ఉన్నచోట వీరమరణం పొందిన పోలీస్ అధికారుల పేర్లను రోడ్లకు, పాఠశాలలకు పెట్టాలి.
● ఇలా చేయడం వల్ల సమాజానికి ఆయా పోలీసులు అందించిన అత్యుత్తమ సేవలు నేటితరానికి తెలియజేసినట్లు అవుతుందని భావన.
● వీరిని స్ఫూర్తిగా తీసుకుని యువత పోలీస్‌శాఖ వైపు ఉద్యోగ లక్ష్యంతో అడుగులు వేస్తారనేది అంచనా.
● రిటైర్డ్, మరణించిన ఉద్యోగుల సేవలను స్మరించుకోవడంతోపాటు వారి ఉద్యోగ అనుభవాలు, ఆలోచనలను తెలుసుకోవడం.
వరంగల్ క్రైం: శాంతియుత సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు.. విధులు సమర్థవంతంగా నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసులు, ఆయా కుటుంబాలు ఇక తమను ఎవరూ పట్టించుకోరు అన్న అపోహను పారదోలేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపి తాము అండగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ‘ఆత్మీయ పలకరింపు’ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నాలుగు మాటలు మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకుని పండ్లు, స్వీట్లు అందిస్తున్నారు. ‘మీరు అందించిన సేవల వల్ల ప్రస్తుత పోలీసులు ఎంతో స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారు. మీ సేవలను మరిచిపోం, మీకు అండగా మేం ఉంటాం’ అనే భరోసా ఇస్తున్నారు. డీజీపీ శివధర్‌రెడ్డి ఆలోచన.. ఆదేశాలతో క్షేత్రస్థాయిల్లో పోలీస్ కుటుంబాలను పలకరిస్తున్న పోలీస్ అధికారులకు మంచి స్పందన వస్తోంది.
ముందు వరుసలో ‘కాజీపేట డివిజన్’
డీజీపీ శివధర్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తన పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులతో క్షేత్ర స్థాయిలో పోలీస్ కుటుంబాల ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ రాజిరెడ్డి, ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ డీఎస్పీ జన్ను సంజీవరావు, ఏఎస్సై కటకం సంపత్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో రిటైర్డ్ డీఎస్పీ విలియమ్స్, కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుల్లా సంజీవరావు ఇలా పలువురు పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారిని శాలువాలతో సత్కరించారు.
ఆత్మీయ పలకరింపు
డీజీపీ ఆదేశాలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అమలు
సేవలను గుర్తించి వారి అనుభవం..
ఆలోచనలకు ప్రాధాన్యం
ముందు వరుసలో
కాజీపేట సబ్ డివిజన్ సిబ్బంది
రిటైర్డ్, అమరులైన పోలీస్ కుటుంబాలకు భరోసా


