ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్ : అధికారులు, ఉద్యోగులు నిబద్ధతతో జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. సోమవారం బల్దియాలోని కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొని నగరవాసులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్–49, ఇంజనీరింగ్–22, రెవెన్యూ సెక్షన్–12, హెల్త్–శానిటేషన్ విభాగానికి–11, తాగునీటి సరఫరా–3, ఉద్యాన విభాగానికి 1 ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్ పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
అందిన ఫిర్యాదుల్లో కొన్ని..
● వరంగల్ వెంకటరామయ్య కాలనీ, జక్కులొద్ది, హనుమకొండ భద్రకాళీ నగర్–2, 58వ డివిజన్ జవహర్ నగర్ కాలనీ–8లో వీధిలైట్లు, సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● శివనగర్ పుప్పాలగుట్టలో తాగునీటి సరఫరా రావడం లేదని రంజిత్ విన్నవించాడు.
● 32 డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో, రంగశాయిపేటలో, హనుమకొండ వడ్డెపల్లి–7 ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లు, వ్యర్థాల వల్ల అపరిశుభ్రత నెలకొందని దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు విన్నవించారు.
● 17వ డివిజన్ వసంతపూర్‌లో నిధులు మంజూరైన అభివృద్ధి పనులు చేపట్టడం లేదని దళితవాడ కాలనీ సీపీఎం ఏరియా కమిటీ నాయకులు తెలిపారు.
● 26వ డివిజన్ గిర్మాజీపేటలో ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ బాల్నే సురేష్ ఫిర్యాదు చేశారు.
● 40వ డివిజన్ బీరన్నకుంట కాలనీలో అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
● గొర్రెకుంట జంక్షన్ ప్రమాదాలకు అడ్డాగా మారిందని, అభివృద్ధి చేయాలని స్థానికులు విన్నవించారు.
● ములుగు రోడ్డులో చిరువ్యాపారులు చేపల వ్యర్థాలు డ్రెయినేజీల్లో వదిలేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.
● ప్రకాశ్‌రెడ్డి పేట 80ఫీట్ల రోడ్డును అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● 30వ డివిజన్‌లో డ్రెయినేజీకి మరమ్మతులు చేయాలని కాలనీవాసులు విన్నవించారు.
● హనుమకొండ మహాత్మా జ్యోతిబాపూలే కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా సీసీరోడ్డు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలన్నారు.


