పారా అథ్లెట్ దీప్తికి గౌరవం..
● హైదరాబాద్‌లోని ఓ ప్లైఓవర్ పిల్లర్‌పై
ఆమె రన్నింగ్ చిత్రం
పర్వతగిరి : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫ్లైఓవర్ పిల్లర్‌పై సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి గౌరవార్థం ఆమె రన్నింగ్ చిత్రం వేశారు. దీప్తి పారిస్ పారా ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతోపాటు అర్జున అవార్డు సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో 400మీటర్లు, 200మీటర్ల పరుగు పందెంలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. దీంతో దీప్తి ప్రతిభకు గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మామునూరు పీఎస్‌లో
ఇద్దరు సస్పెన్షన్
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలోని మామునూ రు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. పర్యవేక్షణ అధికారులు మౌనం వహించ డం, కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పోలీస్ స్టేషన్ పాలన అస్తవ్యస్తంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేసు విషయంలో మామునూరు ఇన్‌స్పెక్టర్ ఒంటేరు రమేశ్, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌కు పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేసి ఒక్కరోజు కాకముందే అదే పీఎస్‌లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై సీపీ సస్పెన్షన్ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్‌లో చర్చనీయాంశమైంది. పది రోజుల క్రితం వాహనాల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను పీఎస్ లో విచారిస్తున్న క్రమంలో ఆ నిందితులు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారు. ఈ ఘటనలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు హెడ్ కాని స్టేబుల్ ఎండీ యూసుఫ్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిందితులు పరారైనట్లు నిర్ధారించి సీపీకి నివేదికలు ఇచ్చా రు. దీంతో ఆయన ఆ ఇద్దరి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు పీఎస్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే మరికొంత మంది అధికారులపై చర్యలు ఉండే అవకాశం ఉంది.
29 వరకు డిగ్రీ సెమిస్టర్
పరీక్షల ఫీజు గడువు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ,బీకాం, బీబీఏ, బీఎస్సీ బీ ఒకేషనల్, బీసీఏ, బీహెచ్‌ఎం అండ్ సీటీ (రెగ్యులర్ అండ్ బ్యాక్‌లాగ్) మొదటి, మూడు , ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నారు. ఈమేరకు రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు ఇస్తూ కేయూ పరీక్షలనియంత్రణాధికారి సోమవారం ఫీజు రీ–నోటిఫికేషన్ జారీచేశారు. ఆయా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుములేకుండా ఈనెల27వతేదీతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీవరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు.


