
పాలన గాడిన పడినట్లేనా?
సమస్యలు అలాగే..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా పలు సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. రెగ్యులర్ వీసీగా ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పుడు వర్సిటీలోని వివిధ సమస్యలు పరిష్కారమవుతాయని అంతా భావించారు. కానీ, ఆయన ఏనిర్ణయం తీసుకోవడంలోనైనా, దృష్టికి వచ్చిన సమస్యకు పరిష్కారం చూపడంలోనైనా స్లో పాలన కొనసాగిస్తున్నారు. వీసీగా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించి ఈనెల 19 (ఆదివారం)తో ఏడాది పూర్తవుతోంది. పాలనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈఏడాదిలో వీసీగా కేయూలో చేపట్టిన కార్యక్రమాలు, పరిష్కారానికి నోచుకున్న సమస్యలు, చేపట్టబోయే అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
పాఠాల బోధనేది?
కేయూలో కొన్నేళ్లుగా వివిధ విభాగాల్లో, వివిధ వర్సిటీ కాలేజీల్లోనూ సరిగ్గా తరగతులు జరగడంలేదు. ఉన్న రెగ్యులర్ అధ్యాపకుల్లో కొందరు పరిపాలనా పదవుల్లో కొనసాగుతున్నారు. పాఠాల బోధనపై ఆసక్తి కనబర్చడంలేదు. కొందరు రెండు, మూడు, నాలుగు పదవుల్లోనూ కొనసాగుతుండడం బోధనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకుల్లోనూ కొందరు తరగతులు సరిగ్గా తీసుకోవడం లేదని, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా, ఇటీవల వీసీ ప్రతాప్‌రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు ఎవరూ లేరని గుర్తించారు. ఫార్మసీ కాలేజీకి వెళ్లగా, అక్కడ ప్రిన్సిపాల్, మరో ప్రొఫెసర్ ఉన్నారు. మిగతా పలువురు అధ్యాపకులు ఆసమయంలో విధుల్లో లేరని గుర్తించి ప్రిన్సిపాల్‌తో మాట్లాడినట్లు సమాచారం. వివిధ విభాగాల్లో ప్రాక్టికల్స్ కూడా మొక్కుబడిగానే చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
● ఈఏడాది జూలై 7న కేయూ 23వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఆగస్టులో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతంగా నిర్వహించారు.
● పలు సంస్థలతో ఎంఓయూలు చేపట్టారు.
● ఆరోపణలు వచ్చిన వారిపై కమిటీలు వేశారు. పలువురిపై చర్యలు తీసుకున్నారు. మరో రెండు మూడు నివేదికలపై ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు.
● గతంలోకంటే కేయూకు బ్లాక్‌గ్రాంటును ఈఆర్థిక సంవత్సరంలో కేయూకు బడ్జెట్‌ను రూ.145 కోట్ల వరకు పెంచడానికి వీసీ కృషి చేశారు. గత మూడునెలలుగా పెన్షనర్లకు ప్రభుత్వం పెన్షన్‌ను మంజూరు చేయడం లేదు. వర్సిటీ అంతర్గత నిధుల నుంచి చెల్లిస్తున్నారు.
● రూసా ప్రాజెక్టుల, సైన్స్ రీసెర్చ్‌ప్రాజెక్టుల పరిశోధనలకోసం సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ భవనం, మహిళా హాస్టల్ భవనం, పద్మాక్షి మహిళా హాస్టల్‌లో నూతనంగా డైనింగ్ హాల్ నిర్మించబోతున్నారు.
● కేయూలోని మహిళా హాస్టళ్లన్నింటికీ కలిసి రూ.3.50 కోట్ల వ్యయంతో ప్రహరీ నిర్మించబోతున్నారు.
● కేయూ చుట్టూ ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రూ.20 కోట్ల యూనివర్సిటీ నిధులతో 10.2 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మించబోతున్నారు.
● కేయూ పీజీ హాస్టల్ డైనింగ్ హాల్ వద్ద మరో రూ.40 లక్షలు వెచ్చించి కిచెన్ షెడ్డును నిర్మించారు. దీన్ని త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.
వర్సిటీలో అడ్మిషన్లు పొందిన వారిలో కొందరికి వసతి కల్పించలేకపోతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫస్ట్ ఇయర్‌లో ఎవరికీ హాస్టల్ వసతి కల్పించడం లేదు. మరో రెండు హాస్టళ్ల భవనాలు అవసరం ఉంది.
న్యూపీజీ హాస్టల్ వద్ద రూ.2.50 కోట్ల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మించి మూడేళ్లవుతోంది. నేటికీ వినియోగంలోకి తీసుకురాలేదు.
వర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలనే డిమాండ్ ఉంది. ఇటీవల పాలకమండలి కూడా పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి ఓకే చెప్పింది.
రూ.4.50 కోట్లతో నిర్మించిన కె హబ్‌ను ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకు రాలేదు.
పీవీ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయలేదు.
రూసా ప్రాజెక్టు కింద రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. వివిధ విభాగాల ప్రొఫెసర్లు ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు చేపట్టలేదు.
సూపరింటెండెంట్లకు అసిసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది.
నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులు 150 వరకు భర్తీ చేయాల్సి ఉంది.
1992 నుంచి రెగ్యులర్ బోధనేతర ఉద్యోగుల నియామకాలు లేవు.
పార్ట్‌టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించాలనే డిమాండ్ అలాగే ఉండిపోయింది.
రెగ్యులర్ అధ్యాపకులు 77 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 15 ఏళ్లుగా నియామకాలు లేవు.
కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యాకేంద్రంలో అడ్మిషన్ల సంఖ్య పడిపోతోంది. ప్రవేశాలు పొందిన వారికి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడం లేదు. పరీక్షలు సకాలంలో నిర్వహించడం లేదు.
కేయూ భూముల ఆక్రమణలు గుర్తించి స్వాధీనం చేసుకోవడం లేదు.
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి పాలనకు
నేటితో ఏడాది పూర్తి
వినియోగంలోనికి రాని కె హబ్, డైనింగ్ హాల్
కమిటీలు వేసి చర్యలు
తీసుకోవడంలో జాప్యం
కొన్నేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే..
వేధిస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల కొరత

పాలన గాడిన పడినట్లేనా?

పాలన గాడిన పడినట్లేనా?