
కోర్టులు.. న్యాయం పంచే పవిత్ర స్థలాలు
జనగామ: కోర్టులు న్యాయం పంచే పవిత్ర స్థలాలు అని, న్యాయం జరిగిందన్న నమ్మకంతో కక్షిదారులు కోర్టు నుంచి తిరిగి వెళ్లేలా చూడడం ప్రతీ న్యాయవాది బాధ్యత అని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి అన్నారు. జనగామ మండలం చంపక్ హిల్స్ వద్ద రూ.81 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు నామవరపు రాజేశ్వరావు, బీఆర్ మధుసూదన్‌రావు, సుద్దాల చలపతిరావుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా న్యాయమూర్తి బి.ప్రతిమ, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ యాదవ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, సిద్ధాంతి క్రిమాచాచారి మంత్రోచ్ఛరణల నడుమ కోర్టు నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు జడ్జిలు మొక్కలు నాటి నీరు పోశారు.
న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలి..
సిద్దిపేట రోడ్డులోని ఉషోదయ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసుల పరిష్కారం విషయంలో న్యాయవాదులు ప్రావీణ్యతతో మరింత మెరుగైన పాత్ర పోషించాలన్నారు. కక్షిదారులకు సమగ్ర, ధర్మబద్ధ న్యాయం అందించడం న్యాయవాదుల ప్రధాన లక్ష్యమన్నారు. వరకట్న వేధింపులు, చెక్ బౌన్స్ కేసులు కుటుంబ తగాదాలు, భాగస్వామ్య కేసులు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని త్వరతగతిన పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో న్యాయవాదులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నూతన కోర్టు భవనం రెండేళ్లలో పూర్తవుతుందని కాంట్రాక్టర్ చెప్పారని, కానీ, 20 నెలల్లో ప్రారంభోత్సవం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు. అనంతరం హైకోర్టు ఆద్వర్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ప్రతిమ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ యాదవ్, సీనియర్ సివిల్ జడ్జిలు సి.విక్రమ్, సుచరిత, ప్రిన్సిపల్ జూనిర్ సివిల్ జడ్జి శశి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సందీప, సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకటరాం నర్సయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి
జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి
నూతన కోర్టు భవన సముదాయానికి భూమిపూజ