
శిల్ప కళాసంపద మహాద్భుతం
ఖిలా వరంగల్: చారిత్రక వైభవాన్ని చాటే కాకతీయుల రాజధాని నిర్మాణం, నళ్లరాతితో తయారైన నాటి శిల్ప కళా సంపద మహాద్భుతంగా ఉందని టాంజానియా దేశ మిడ్ లెవెల్ సివిల్ సర్వెంట్ అధికారులు కొనియాడారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ (డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ)లో ప్రాఫెసర్, కోర్సు డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న టాంజానియా దేశానికి అధికారులు శనివారం సాయంత్రం ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. కాకతీయలు కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్‌మాహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, కోట గైడ్ రవియాదవ్ వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్పకళా సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. అనంతరం వారు టీజీ టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సౌండ్ అండ్ లైటింగ్ షోను తిలకించారు. వారి వెంట ఎంసీహెచ్‌ఆర్డీ విజిట్ కో–ఆర్డినేర్ నందకిషోర్, కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్‌చార్జ్ శ్రీకాంత్, టూరిజం అభివృద్ధి సంస్థ మేనేజర్ అజయ్, రాజేశ్ తదితరులు ఉన్నారు.
● టాంజానియా దేశ సివిల్ సర్వెంట్లు

శిల్ప కళాసంపద మహాద్భుతం