
పంటకు ప్రమాదకారి..
దశ/విధానం.. నియంత్రణ చర్యలు
మహబూబాబాద్ రూరల్ : తెల్లదోమ మిర్చి పంటకు ప్రధాన శత్రువు. ఇది ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా చిల్లి లీఫ్ కర్ల్ వైరస్ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పంటలో తెల్లదోమ నియంత్రణ చర్యలు, నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రతలపై మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్.. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం..
మిర్చి పంటను నాటిన తర్వాత మొదటి 30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం. ఈ సమయంలో తెల్లదోమల సంఖ్య పెరిగితే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే రైతులు పొలంలో నాటిన మొదటి రోజునుంచే పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలి.
ప్రారంభ వృద్ధి దశ (10 నుంచి 30 రోజులు) : నీమాయిల్ 1500 పీపీఎం 5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో పిచికారీ చేయాలి. వర్టిసిలియం లెకానీ/ బ్యావేరియా బాసియానా 5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ట్రాప్ క్లోఫ్స్ పై తెల్లదోమలు చేరితే అక్కడే ప్రత్యేకంగా స్ప్రే చేయాలి.
మధ్య వృద్ధి దశ (30 నుంచి 50 రోజులు) : పొలాన్ని ప్రతీ 3 నుంచి 4 రోజులకు పర్యవేక్షించాలి. తెల్లదోమల సంఖ్య పెరిగితే మారుస్తూ వాడాలి. ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్‌ఎల్ 0.3 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. లేదా థియామెథాక్సామ్ 25 డబ్ల్యూజీ 0.25 గ్రాములను లీటర్ నీటితో స్ప్రే చేయాలి. ఒకే ఔషధాన్ని పునరావృతం చేయకుండా మారుస్తూ వాడాలి.
నియంత్రణ కొనసాగించాలి (50 రోజులుపైగా) : తెల్ల దోమల నివారణకు ఎర పంటలపై దృష్టి పెట్టి నియంత్రణ కొనసాగించాలి. వర్షాభావం / పొడిగాలి సమయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి. రసాయనాలను అవసరమైతే మాత్రమే వాడాలి.
పర్యావరణం, పొలం నిర్వహణ : ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, తేమ 60 నుంచి 80 శాతం ఉన్నప్పుడు తెల్లదోమలు ఎక్కువ పెరుగుతాయి. ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి ప్రసరణకు అనుకూలంగా మొక్కల మధ్య దూరం పెట్టాలి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూడాలి. నాటిన వెంటనే (0 నుంచి 10 రోజులు) ఎకరానికి 10 నుంచి 12 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తొలగించాలి. పత్తి, పొద్దు తిరుగుడు, ఆముదం మొక్కలను పొలం అంచుల్లో నాటాలి.
తెల్లదోమ.. మిర్చి పంటకు ప్రధాన శత్రువు
ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను
బలహీనం చేస్తుంది
పంటలో నియంత్రణ చర్యలు చేపట్టాలి
నాటిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి
రైతులకు శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్ సలహాలు

పంటకు ప్రమాదకారి..

పంటకు ప్రమాదకారి..