
అధిక వడ్డీ ఆశచూపి మోసం..
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రైవేట్ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయని ఓ వ్యక్తి నమ్మించగా పలువురు ఆ సంస్థలో పెట్టుబడిపెట్టారు. ఏడాది కావొస్తున్న నిర్వాహకుడు పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా కాలం వెల్లదీయడంతోపాటు చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు భావనారుషి మౌనిక, అలేఖ్య, సుజాత కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బత్తుల రవికిరణ్ ‘అమ్మానాన్న ట్రస్ట్’ పేరిట కార్యాలయం ఏర్పాటు చేశాడు. సదరు వ్యక్తి తన సంస్థలో పెట్టుబడిపెడితే డబ్బులు అధికంగా వస్తాయని నమ్మించాడు. దీనిని నమ్మిన పలువురు మొత్తం సుమారు రూ.12 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే పెట్టుబడిపెట్టి ఏడాది కావొస్తున్నా డబ్బులు ఇవ్వమని అడిగితే సదరు సంస్థ నిర్వాహకుడు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తూ మోసం చేస్తున్నాడు. బంగారం తాకట్టుపెట్టి మరి డబ్బులు తీసుకొచ్చి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టామని, తమ డబ్బులు ఇవాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబాబాద్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై టౌన్ సీఐ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా బాధిత మహిళలు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ‘అమ్మానాన్న ట్రస్ట్’ నిర్వాహకుడు బత్తుల రవికిరణ్‌ను వివరణ కోరగా తాను ఎవరిని మోసం చేయలేదని, మహిళల ఆరోపణలు అవాస్తవమన్నారు.