
అత్యున్నత శక్తికి నిదర్శనం దుర్గాదేవి
హన్మకొండ కల్చరల్: దుర్గాదేవి విశ్వవ్యాప్తమై ఉన్న అత్యున్నత శక్తికి నిదర్శనమని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మంగళవారం అమ్మవారు దుర్గదేవిగా దర్శనమిచ్చారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌శర్మ, సందీప్‌శర్మ సుప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించి దుర్గాదేవిగా అలంకరించారు. ఆధ్యాత్మిక వేత్త, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖ్ భరత్ జీ, తెలంగాణ రాష్ట్ర శాప్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి పూజలు జరుపుకున్నారు. యాగశాలలో చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సేవా కార్యక్రమంలో రేపల్లె రంగనాఽథ్, చొల్లేటి కృష్ణమాచారి, గండ్రాతిరాజు, సిబ్బంది బధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.