
గోదావరి వరదతో మునిగిన మిర్చి పంటలు
● 20 ఎకరాల్లో నష్టం..
● లబోదిబోమంటున్న రైతులు
ఏటూరునాగారం: గోదావరి రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చుతోంది. మండలంలోని రామన్నగూడెం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికకు చేరింది. దీంతో ఏటూరునాగారంలోని మానసపల్లి, ఓడవాడ శివారు ప్రాంతాల్లోని మిర్చి పంటలు వరదతో మునిగాయి. మొక్కలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. అంతేకాకుండా వరద రెండు రోజుల నుంచి నిలిచి ఉండడంతో మిర్చి నారు కుళ్లి మొక్క చనిపోయే ప్రమాదం ఉందని రైతులు లబో ది బోమంటున్నారు. కందకట్ల రమేశ్, గండెపల్లి ఈశ్వ దరయ్య, గంప శ్రీను, వంగరి రామయ్య, పడాల మల్లికార్జున్, సాయిరి అశోక్, ఐయినాల రాములు, నామని సాంబశివరావుకు చెందిన సుమారు 20 ఎకరాల్లో మిర్చితోట మొత్తం మునిగింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేస్తుంటే వరద నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
గోదావరి కాస్త తగ్గుముఖం
కాళేశ్వరం: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 10.37లక్షల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. కాగా, సోమవారం 13.290 మీటర్లకు వరద నీటిమట్టం చేరగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 11.37 లక్షల క్యూసెక్కులు తరలిపోయాయి. కాగా, సాయంత్రం వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది.
హన్మకొండ అర్బన్: గతంలో భీమదేవరపల్లి, కాజీపేట తహసీల్దార్‌గా పని చేసి ఎన్నికల సమయంలో జిల్లా నుంచి బదిలీ అయిన కిరణ్ కుమార్‌ను ప్రభుత్వం హనుమకొండ జిల్లాకు కేటాయించింది. దీంతో ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో రిపోర్టు చేశారు. ప్రస్తుతం ఆయన కలెక్టరేట్‌లో సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు కేటాయిస్తారని సమాచారం.

గోదావరి వరదతో మునిగిన మిర్చి పంటలు