
గొర్రెలను తప్పించబోయి లారీ బోల్తా
పరకాల : మండలంలోని కామారెడ్డిపల్లి వద్ద గొర్రెల మందను తప్పించబోయి కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి హెడ్ కానిస్టేబుల్ ద్విచక్రవాహనంతో పాటు గొర్రెల కాపరిని ఢీకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలపాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్ మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాందారిపేట నుంచి పరకాల వైపునకు కంకర లోడ్‌తో లారీ వేగంగా వస్తోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ గొర్రెల మందను తప్పించే క్రమంలో పరకాల పోలీస్‌స్టేషన్‌లో విధులు ముగించుకొని స్వగ్రామం పత్తిపాకకు బైక్‌పై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్‌ను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా గొర్రెల కాపరి పాలకుర్తి సాంబయ్యను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ విషయం తెలియగానే స్థానికులు 108కు సమాచారం అందజేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం వరకు తమతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పోలీసు అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. గొర్రెల కాపరి సాంబయ్య వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనపై పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు.
అదుపు తప్పి బైక్‌ను ఢీకొనడంతో
హెడ్ కానిస్టేబుల్ మృతి
మరొకరికి తీవ్రగాయాలు