
ప్రభుత్వ పాఠశాలలకు చేయూత
విద్యారణ్యపురి: కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం కింద హనుమకొండలోని జోస్ అలుక్కాస్ నగల దుకాణం, వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఆరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సుమారు రూ.11.75 లక్షలకు పైగా విలువైన వివిధ వస్తువులు కంప్యూటర్ల కోసం చెక్కులు పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేతుల మీదుగా.. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ఆ నగల షాప్‌నకు సంబంధించి మేనేజర్ ఇతర ప్రతినిధులు పంపిణీ చేయించారు. హనుమకొండ జూలైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డికి రూ.2.15 లక్షల చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ నగదుతో ఆరు కంప్యూటర్లు జోస్ అలుక్కాస్ యాజమాన్యం ఇవ్వనుందని హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు. అలాగే లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు 2.9 లక్షలతో 150 లీటర్లకు సంబంధించిన వాటర్ కూలర్, 4 కంప్యూటర్లు అందించనున్నారు. కాజీపేట జాగీర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.2.1 లక్షతో ఒక ప్రొజెక్టర్, ఒక వాటర్ కూలర్, రెండు కంప్యూటర్లు అందించనున్నారు. వరంగల్‌లోని రైల్వేగేట్ పెరకవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.2.9 లక్షలు, కాజీపేటలోని బాలుర ప్రభుత్వ పాథమిక పాఠశాలకు రూ. 1.21 లక్షల చెక్కును, వేలేరులోని మండల ప్రజాపరిషత్ స్కూల్‌కు రూ.2.26 లక్షల చెక్కును ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేశారు. ఆయా డబ్బులతో జోస్ అలుక్కాస్ నగల షాపు యాజమాన్యమే ఆ యా స్కూల్స్‌కు అవసరమైన కంప్యూటర్లు, వివిధ వస్తువులను కొనుగోలు చేసి ఇవ్వనుంది. కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ హనుమకొండ మేనేజర్ టి.స్మితీష్, అసిస్టెంట్ మేనేజర్ గిరీష్, అకౌంట్స్ మేనేజర్ సుధీప్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ