పక్కాగా పంటల లెక్క | - | Sakshi
Sakshi News home page

పక్కాగా పంటల లెక్క

Sep 14 2025 6:19 AM | Updated on Sep 14 2025 6:19 AM

పక్కా

పక్కాగా పంటల లెక్క

హన్మకొండ: వానా కాలం పంటల సాగు లెక్కలు కచ్చితంగా తేల్చేందుకు ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేపట్టింది. వ్వవసాయ విస్తరణాధికారులు మొబైల్‌ ఫోన్‌లోని ప్రత్యేక యాప్‌లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేస్తున్నారు. సాగు చేసిన పంటల ఫొటోలు కూడా యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇంతకు ముందు అంచనాల ఆధారంగా పంటలు నమోదు చేసేవారు. అయితే, కచ్చితత్వం కోసం పంటలను భౌతికంగా చూడడం ద్వారా పంటల సాగు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తద్వారా ప్రభుత్వం మార్కెటింగ్‌ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు, నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

జిల్లాలో 14 మండలాల్లోని 125 గ్రామాల్లో 55 క్లస్టర్లున్నాయి. 55 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)లు సర్వేలో మునిగిపోయారు. జిల్లాలో 2,21,163 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వరి 1,38,803 ఎకరాలు, పత్తి 74,849 ఎకరాలు, మొక్కజొన్న 7080, పప్పు దినుసులు 395, నూనె గింజల పంటలు 32 ఎకరాలతో పాటు ఇతర పంటలు సాగు చేశారు. పురుష ఏఈఓలు 2 వేల ఎకరాల్లో, మహిళా ఏఈఓలు 1800 ఎకరాల్లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేస్తారు. ఈమేరకు సర్వే నంబర్ల వారీగా ఏఈఓలకు పంటల సర్వే విస్తీర్ణాన్ని కేటాయించారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో పంట బుకింగ్‌ పూర్తి చేయడానికి వీలుగా ఈ యాప్‌ ఆఫ్‌లైన్‌ ఫీచర్‌తో రూపొందించారు.

వరి సాగు ఏ పద్ధలో చేశారో కూడా నమోదు చేసేలా యాప్‌ను రూపొందించారు. పంట విత్తిన వివరాలు నమోదు ద్వారా ఆ పంట ఎప్పుడు కోతకు వస్తుందో అంచనా వేయడం ద్వారా పంట కొనుగోలు/సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకునే అవకాశముంటుంది. పంట బుకింగ్‌ 90 శాతం బుకింగ్‌ చేయగానే రైతు మొబైల్‌కు ఆరు సందేశాలు వెళ్తాయి. పంటల సాగులో తేడాలుంటే ఏఈఓను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి.

అక్టోబర్‌ 25 వరకు పూర్తిచేయాలి..

జిల్లాలో అక్టోబర్‌ 25 వరకు పంటల బుకింగ్‌ పూర్తి చేయాలి. అదే నెల 27న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిజికల్‌ క్రాప్‌ సర్వే వివరాలు ప్రదర్శిస్తారు. నవంబర్‌ 1న రైతుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. 3న అభ్యర్థనలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. 5న తుది సర్వేను ప్రదర్శిస్తారు.

వివరాలు నమోదు చేయకుంటే ఇబ్బందులు..

పంటల వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోకుంటే పంట ఉత్పత్తుల విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన తర్వాత ఆన్‌లైన్‌లో ఉన్న సాగు విస్తీర్ణం మేరకు వచ్చే పంట దిగుబడి అంచనాకు సరితూగాలి. తేడాలుంటే పంట ఉత్పత్తుల చెల్లింపులు ఆలస్యమవుతాయి. పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందడం, బీమా వర్తింపు వంటి సాయం అందించడానికి ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉంటుంది.

క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న ఏఈఓలు

హనుమకొండ జిల్లాలో 125 గ్రామాలు, 55 క్లస్టర్లు

2,21,163 ఎకరాల్లో పంటల సాగు

పంటలు నమోదు చేయించుకోవాలి..

రైతులు స్వచ్చందంగా పంటలు నమోదు చేయించుకోవాలి. అక్టోబర్‌ 25లోపు డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో పంటల సాగు వివరాలు నమోదు చేసుకోవాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయికి చేరుకుని డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేస్తారు. రైతులు సర్వే నంబర్‌, పంటల వారీగా వివరాలు నమోదు చేయించుకోవాలి.

– రవీందర్‌సింగ్‌, జిల్లా వ్యవసాయాధికారి

పక్కాగా పంటల లెక్క1
1/1

పక్కాగా పంటల లెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement