మళ్లీ మొదటికి వచ్చినట్లేనా? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికి వచ్చినట్లేనా?

Sep 14 2025 6:19 AM | Updated on Sep 14 2025 6:19 AM

మళ్లీ మొదటికి వచ్చినట్లేనా?

మళ్లీ మొదటికి వచ్చినట్లేనా?

పదోన్నతులకు బ్రేక్‌పడినట్లేనా?

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాన్ని ఆమోదిస్తూ ఈ ఏడాది మే 8న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీఓ 22ను సవాల్‌ చేస్తూ అప్పట్లో ఉద్యోగం రాని వినిత నాయిని హైకోర్టులో ఈనెల 9న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కాకతీయ యూనివర్సిటీ, కేయూలో 2010లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమితులైన వారిని ప్రతివాదులుగా చేర్చారు. దీంతో హైకోర్టు ఈనెల 9న వాదనలు వింటూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి, కాకతీయ యూనివర్సిటీకి కౌంటర్‌దాఖలు చేయాలని, 2010లో నియమితులైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు నోటీస్‌లు జారీచేయాలని ఆదేశాలు ఇస్తూ ఈ కేసును అక్టోబర్‌ 9వ తేదీకి వాయిదా వేసింది.

మొదటి నుంచీ వివాదమే..

కాకతీయ యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో నియమితులైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలపై అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉన్న విషయం విధితమే. అప్పట్లో ఉద్యోగాలు రాని పలువురు అభ్యర్థులు ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా చివరికి పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో ఆమోదించుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. దీంతో 2019 నవంబర్‌లో కేయూ పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో చర్చించి అవకతవకలు చోటుచేసుకున్నాయని భావించి ఆమోదించలేదు. దీంతో అప్పటి రిజిస్ట్రార్‌ తుది నిర్ణయం కోసం ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో జువాలజీ విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను యూనివర్సిటీ అధికారులు కొంత కాలం క్రితమే ఉద్యోగాలనుంచి తొలగించిన విషయం విధితమే.ఆ తర్వాత కూడా ఉద్యోగం రాని వినితనాయిని అప్పటి నుంచి న్యాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. మిగతా పలువురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తమ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం కూడా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి సుప్రీం కోర్టు.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ తుది నిర్ణయం తీసుకోవాలని ఈఏడాది ఫిబ్రవరి 24న ఆదేశించిన విషయం విధితమే. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా ఉన్నత విద్యాశాఖ 2010లో నియమితులైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలపై(అప్రూవల్‌ చేస్తూ) సానుకూల నిర్ణయం తీసుకుని జీఓ 22ను ఈఏడాది మే 8న యూనివర్సిటీ అధికారులకు పంపింది. తదుపరి చర్యలను తీసుకోవాలని కూడా పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించబడిన ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు జీఓలో మాత్రం అవకాశం కల్పించ లేదు. ఈక్రమంలో జూన్‌ 17న హైదరాబాద్‌లో నిర్వహించిన కేయూ పాలకమండలి సమావేశంలో 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలపై చర్చించి ఆమోదించింది. దీంతో ఆయా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఊపిరి పీల్చుకున్నారు. కేయూపాలకమండలి ఆమోదించడంతో వారంతా సంతోషించారు.

ఆ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకంపై వినితనాయిని మళ్లీ రిట్‌ పిటిషన్‌

కౌంటర్‌దాఖలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కేయూకు హైకోర్టు ఆదేశం

కేయూపాలకమండలి ఆమోదంతో ఆయా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ కూడా ఇటీవలే ప్రారంభించినట్లు తెలిసింది. పదోన్నతుల కల్పనకు యూనివర్సిటీ అధికారులు కూడా కొద్దిరోజుల్లోనే ఉపక్రమించబోతుండగా మళ్లీ అప్పట్లో ఉద్యోగం రాని వినితనాయిని.. ఉన్నత విద్యాశాఖ ఆయా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలను ఆమోదిస్తూ సానుకూలంగా జారీచేసిన జీఓను సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో వీరి సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లైందని కాకతీయ యూనివర్సిటీలో చర్చ జరుగుతోంది. వీరికి ఇక ఇప్పట్లో పదోన్నతుల కల్పన ఉండబోదని, ప్రస్తుతానికి బ్రేక్‌ పడినట్లేనని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement