
పగిలిన ‘దేవాదుల’పైపులైన్
● ఎగిసిపడిన నీరు..
నిండిన జయగిరి పాత చెరువు
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం జయగిరి పాత చెరువు వద్ద దేవాదుల పైపులైన్ పగిలింది. ఇటీవల దేవాదుల నుంచి నీటిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితం జయగిరి సమీపంలోని పాత చెరువు వద్ద పైపునకు చిన్న రంధ్రం పడింది. అది పెద్దది కావడంతో ఒత్తిడి పెరిగి పగిలింది. దీంతో ఒకేసారి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ నీరంతా సమీప చెరువులోకి చేరడంతో నిండి మత్తడి పోసింది. చెరువుకింద ఉన్న పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం అందుకున్న నీటి పారుదలశాఖ ఎస్‌ఈ రాంప్రసాద్, ఈఈ మంగీలాల్, సునీత, డీఈఈ కిషన్ ప్రసాద్, తేజేశ్వర్‌రావు, ఏఈ శ్రీనివాస్‌లు ఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పులుకుర్తి వద్ద పంపింగ్‌ను నిలిపివేశారు,.
రైలు నుంచి జారిపడి
ప్రయాణికుడి దుర్మరణం
ఖిలా వరంగల్: ప్రమాదవశాత్తు శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారి పడి ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. వెస్ట్ బెంగాల్‌లోని తిల్న్ చౌదర్ గ్రామానికి చెందిన లాబాను కరుణాకర్ (41).. అబ్దుల్ సల్మాన్, రంజిత్ మరిడేతో కలిసి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడ నుంచి వరంగల్‌కు ప్రయాణిస్తున్నాడు. ఈక్రమంలో చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య కరుణాకర్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి అక్కడికక్కడే దుర్మణం చెందాడు. మృతుడి బంధువులకు సమాచారం అందజేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వరంగల్ జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు.