
అర్ధశతాబ్దపు ఆనందోత్సవం..
తరలిరానున్న
పూర్వవిద్యార్థులు
12,13వ తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో..
అక్టోబర్ 11,12 తేదీల్లో హైదరాబాద్‌లో..
నేడు ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల ఏర్పాటై 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (ఈనెల 4న) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు కేయూలో ప్రారంభమై అమెరికా, హైదరాబాద్‌లో కూడా జరగనున్నాయి.
ఉస్మానియా నుంచి షిఫ్ట్..
బీ ఫార్మసీ కోర్సు తొలుత హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1974లో ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 1975లోనే వరంగల్‌కు షిఫ్ట్ అయ్యింది (కేయూకు). తొలుత ఆర్‌ఈసీ, కేఎంసీలో కూడా తరగతులు జరిగేవి. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో బీఫార్మసీ కోర్సుతో ప్రారంభమైన ఈ ఫార్మసీ కాలేజీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది ఎం.ఫార్మసీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ కూడా కొనసాగుతున్నాయి.ఈ ఫార్మస్యూటికల్ సైన్సెస్‌లో పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2024లో ఈ ఫార్మసీ కాలేజీ ఎన్‌ఆర్‌ఐఎఫ్ ర్యాంకింగ్‌లో 88వ స్థానంలో నిలిచింది. పలువురి ప్రొఫెసర్లు వివిధ పరిశోధనల్లో 12 పేటెంట్లు కలిగి ఉన్నారు. ఇప్పటివరకు 350మంది పైగా పరిశోధకులు పీహెచ్‌డీ పూర్తిచేశారు.
దేశ, విదేశాలలో స్థిరపడిన పూర్వవిద్యార్థులు
కాకతీయ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో (కాలేజీ) చదివిన, పరిశోధనలు చేసిన ఎంతోమంది విద్యార్థులు దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ మంది ఫార్మసీ రంగంలో సైంటిస్టులు, ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అలాగే, కొందరు ఔషధ పరిశ్రమలు స్థాపించారు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, ఇథియోపియా, సౌతాఫ్రికా అరబ్ దేశాల్లోనూ ఉన్నతస్థానంలో స్థిరపడ్డారు.
ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సుమారు 300 మంది పూర్వవిద్యార్థులు తరలి రానున్నారు. ప్రస్తుత విద్యార్థులు 250మందికిపైగా పాల్గొనబోతున్నారని గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కన్వీనర్, డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 10గంటలకు సెనేట్‌హాల్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీసీ కె. ప్రతాప్‌రెడ్డి ముఖ్యఅతిథిగా, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ వి. రామచంద్రం, రిటైర్డ్ ప్రొఫెసర్లు డి. రాంబహు, వి. మల్లారెడ్డి, పి. అమరేశ్వర్, ఏవిఎన్ అప్పారావు, హైదరాబాద్‌లోని యూరో మెడికేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జె. రాజమౌళి, హైదరాబాద్ ఎస్‌ఎన్‌వీపీఎంవీ సీఎండీ బి. ప్రభాశంకర్ పాల్గొననున్నారు. ఉత్సవాలకు చైర్మన్‌గా ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి, కన్వీనర్‌గా గాదె సమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వై. నర్సింహారెడ్డి వ్యవహరిస్తున్నారు.
అమెరికాలో స్థిరపడిన కేయూ ఫార్మసీ కాలేజీ పూర్వ విద్యార్థులు ఈనెల 12,13తేదీల్లో అక్కడే అట్లాంటాలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించకోబోతున్నారు. అక్కడ నుంచి కేయూకు రాలేనివారు ఈ ఉత్సవాలను నిర్వహించుకున్నారు.
హైదరాబాద్‌లోని కేయూ ఫార్మసీ కాలేజీ పూర్వవిద్యార్థు అక్టోబర్ 11,12 తేదీల్లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నారు. మళ్లీ కేయూలో డిసెంబర్ 27, 28తేదీల్లో ముగింపు సమావేశాలు నిర్వహించనున్నారు.
తరలిరానున్న పూర్వ, ప్రస్తుత విద్యార్థులు
ఈనెల 12,13 తేదీల్లో అమెరికాలో కూడా..