
రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు
బీసీ
రిజర్వేషన్లపై
● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
హన్మకొండ: బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బుధవారం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు గల్లీలో మద్దతు ఇస్తూ ఢిల్లీలో అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుకుండా ప్రధాన పార్టీలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం, అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి 60 శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా మోసం చేస్తున్నాయన్నారు. నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినా ఇండియా కూటమి ఎంపీలు, బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై నోరు విప్పలేదని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ అయ్యాయని, ఈ కుట్రలను బీసీలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపి 5 నెలలవుతున్నా మోక్షం లేదన్నారు. అఖిలపక్షాన గవర్నర్‌ను కలిస్తే బీజేపీ కలిసి రాలేదని, పైగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టేది లేదని చెప్పుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్షం కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమయం ఇవ్వడం లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు సంగని మల్లీశ్వర్, వరంగల్ శ్రీనివాస్, దాడి మల్ల య్య యాదవ్, అరుంధతి, తమ్మల శోభారాణి, పద్మజ, బీమగాని యాదగిరి గౌడ్, పాండవుల శ్రీనివాస్, కొట్టే మహేందర్ పాల్గొన్నారు.