
బహుళ అంతస్తులు
ఇరుకు
రోడ్లు..
వరంగల్ అర్బన్: ఇరుకు రోడ్లు. బహుళ అంతస్తులు. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్, ఫైరింజన్ వెళ్లలేని పరిస్థితి. పైగా.. అనుమతి లేని, ఆక్రమణ భవనాలు నగరంలో కోకొల్లలు. ఇలాంటి నిర్మాణాలను బల్దియా, టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులకు కోసం వెంపర్లాడుతూ, స్థానిక కార్పొరేటర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకనే చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్లను విస్త్తరించాలనే ఆలోచనను అధికారులు విస్మరిస్తున్నారు. దీంతో అక్రమ భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ఆమ్యామ్యాలు.. అక్రమంగా భవనాలు
వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో 12 లక్షల మందికిపైగా జనాభా ఉంది. 2.50 లక్షలకుపైగా నివాసాలున్నాయి. 4 లక్షలకు పైగా.. వాహనాలు ఉండగా.. 5,304 కిలోమిటర్ల మేర రహదారులున్నాయి. జనాభాకు, వాహనాలకు తగిన రహదారులు లేవు. ట్రైసిటీ శివారు, విలీన గ్రామాల్లో రోడ్లు దుర్భరంగా మారాయి. ప్రధాన రహదారులు మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరణ, అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి రోజూ నగరానికి వచ్చే 3 లక్షల మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. పండుగల సందర్భంగా ఈ అవస్థలు వర్ణనాతీతం.
మరిచిన రోడ్ల విస్తరణ
ఒకప్పటి జనాభాకు ఇప్పుడున్న రోడ్లు సరిపోవట్లేదు. దాదాపుగా ప్రతీ కుటుంబానికి ఒకటి నుంచి 3 వాహనాలుంటున్నాయి. అందరూ వాహనాలతో రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అదేవిధంగా వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు సెట్ బ్యాక్‌ను పట్టించుకోకుండా, అంగుళం వదలకుండా ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించుకుంటున్నారు. వీధుల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు తిరిగేలా కనీస ఆంక్షలు విధించాలి. రోడ్లను విస్తరిస్తే బాధితుల ఓట్లు తమకు పడవని ప్రజాప్రతినిధులు మోకాలాడుతున్నారు. ఇదే అదునుగా భావించి అక్రమ భవన నిర్మాణాలను స్థానిక కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అధికారులు లంచం తీసుకుని పర్మిషన్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయమై బల్దియా ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ వాడేకర్‌ను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా కార్యాలయంలో అందుబాటులో లేరు. ఫోన్ చేస్తే తీయలేదు. బల్దియా పాలకవర్గం పెద్దలు, కమిషనర్ ఇరుకు రోడ్లను మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా విస్తరించాలని, అనుమతి లేని భవనాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏ ప్రమాదం జరిగినా వెళ్లలేని వాహనాలు..
రాకపోకలకు తీవ్ర అంతరాయం
మామూళ్లతో సరిపెడుతున్న
టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అధికారులు
లంచాలు పుచ్చుకుని
యంత్రాంగంపై కార్పొరేటర్ల ఒత్తిడి
ఎక్కడెక్కడంటే..
వరంగల్‌లోని మండిబజార్, చార్‌బౌళి, నిజాంపురా, ఎల్లంబజార్, పాటక్ మహల్, పాపయ్యపేట చమన్, పిన్నావారి వీధి, బట్టలబజార్, సాకరాశికుంట హరిజన వాడ, గిర్మాజీపేట, గోవిందరాజుల గుట్ట ముదిరాజ్ వాడ, హరిజ నవాడ, లక్ష్మీపురం, ఎల్‌బీనగర్, రామన్నపేట, ఉర్సు, హనుమకొండ బ్రహ్మణవాడ, కుమార్‌పల్లి, న్యూ రాయపురా, న్యూశాయంపేట, దర్గా కాజీపేట తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న గల్లీల్లో పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి.
వరంగల్ మండిబజార్‌లోని ఓ 3 ఫీట్ల రోడ్డు. అందులో 3 నుంచి 4 అంతస్తుల భవనాలు వెలిశాయి. ఎదురెదురుగా ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేవు. కానీ.. దర్జాగా భవంతులను నిర్మించుకుని యాజమానులతోపాటు అద్దెలకు ఇస్తున్నారు.

బహుళ అంతస్తులు