
దారి తప్పుతున్న నిట్ విద్యార్థులు!
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఏటా తరగతులు ప్రారంభమైన తొలిరోజుల్లో కళాశాల నుంచి బయట అడుగుపెడుతున్నారు. ప్రతీ ఏడాది ఈతీరు కొనసాగుతున్నా.. నిట్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోతుండడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి భద్రత కల్పిస్తుందని నమ్మి నిట్‌లో చేర్పించి ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులకు ఏటా చోటుచేసుకుంటున్న ఘటనలు కునుకు లేకుండా చేస్తున్నాయి.
దారితప్పి అడవిలో..
నిట్ వరంగల్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ముగ్గురు అమ్మాయి, నలుగురు అబ్బాయిలు శనివారం ఉదయం నిట్ నుంచి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మహితాపురంలోని జలపాతాలను వీక్షించేందుకు బయల్దేరారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తమైన పోలీస్, ఫారెస్ట్ అధికారులు జలపాతాల వీక్షణకు అనుమతులు కల్పించలేదు. కాగా.. నిబంధనలను పట్టించుకోకుండా జలపాతాల వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. సరదాగా గడుపుతూ రాత్రి వేళ ఛత్తీస్‌గఢ్ సమీపంలోని ములుగు వెంకటాపూర్ జలపాతాల అడవుల్లో చిక్కుకుపోయారు. సుమారు ఆరుగంటల పాటు దారి కోసం వెతుకు తూ రాత్రి 9 గంటల ప్రాంతంలో డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన వెంకటాపూర్ పోలీసులు, ఫారెస్ట్ అధికారులు విద్యార్థులు పంపించిన గూగుల్ లోకేషన్ ఆధారంగా వారి వద్దకు చేరుకుని కాపాడారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదనకు లోనయ్యారు. కాగా.. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు.
భద్రత ఏది?
నిట్ వరంగల్‌లో విద్యార్థులు బయటకెళ్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా.. 2024లో ఓ విద్యార్థి హైదరాబాద్ ప్రాంతంలో ప్రమాదానికి గురై మరణించాడు. 2023లో రాత్రి వేళ్లలో అద్దె కారు తీసుకుని ఐదుగురు విద్యార్థులు మేడారం సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కారు ప్రమాదానికి గురై ఒక విద్యార్థిని మృతి చెందగా.. మిగతా విద్యార్థులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈఏడాది ఏడుగురు విద్యార్థులు అడవిలో తప్పిపోయి, తృటిలో ప్రమా దం నుంచి తప్పించుకున్నారు. కాగా.. నిట్ యాజ మాన్యం విద్యార్థులపై నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రతీ ఏడాది కళాశాల నుంచి బయటకు..
రెండేళ్లలో ఇద్దరు విద్యార్థుల
మృత్యువాత
సెక్యూరిటీ పనితీరుపై
తల్లిదండ్రుల ఆవేదన