
గ్రీవెన్స్ తీరు మారాల్సిందే..
హన్మకొండ అర్బన్: కలెక్టరేట్‌లో ప్రతీవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ తీరు మా రాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణిలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గ్రీవెన్స్ నిర్వహణపై అధికారులతో మాట్లాడి ప్రస్తుతం నిర్వహిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సమ యం వెచ్చించి సమస్యలు విన్నవించేందుకు గ్రీవె న్స్‌సెల్‌కు వస్తారని, గ్రీవెన్స్ దరఖాస్తు రసీదు కో సం గంటల తరబడి వేచి ఉండడం ఏంటని అధి కారులను ప్రశ్నించారు. కలెక్టర్ సంతకం చేసి సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత ఆపరేట ర్ దగ్గర వెయిటింగ్ ఎందుకని ప్రశ్నించారు. ఇకపై ఈ పద్ధతి మార్చాలని అధికారులను ఆదేశించారు.
ముందే రసీదు ఇవ్వండి
సోమవారం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుదారులకు ఇకపై ముందే రసీదు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణికి వచ్చినవారు నేరుగా రసీదులు ఇచ్చే ప్రదేశంలో సంబంధిత సిబ్బందికి తమ దరఖాస్తు ఇస్తే అది పరిశీలించి ఏ శాఖకు వెళ్లాలో ఆ శాఖ పేరు పైన రాయాలని, మిగతా వివరాలతో రసీదు ఇస్తే రసీదుతో పాటు దరఖాస్తు తీసుకొని వారు తన వద్దకు వస్తారని తెలిపారు. ఒకవేళ సిబ్బందికి సంబంధిత దరఖాస్తు ఏ శాఖకు ఫార్వర్డ్ చేయాలో.. తెలియకపోతే కలెక్టర్ పేరుతో పంపాలని సూచించారు. అప్పుడు ఆ దరఖాస్తుపై కలెక్టరే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అవసరమైతే దరఖాస్తు తీసుకునే చోట ఒక సీనియర్ అధికారి ఉండి అది ఏ శాఖకు సంబంధించిందో పరిశీలించాలన్నారు. వచ్చే సోమవారం ప్రజావాణి నుంచే ఇది అమలు కావాలని, అలా ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి మార్పులు చేర్పులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
తొలి రోజు నుంచే మార్పునకు శ్రీకారం
కలెక్టర్‌గా విధుల్లో చేరిన నాటి నుంచే స్నేహ శబరీష్ పాలనపై తన మార్క్ చూపిస్తున్నారు. మొదటి రోజు ప్రజావాణి సందర్భంగా ప్రజలు బారులుదీరి నిలబడడం చూసి ఆవేదన చెందారు. వారందరికీ కుర్చీలు వేసి కూర్చోబెట్టాలని ఆదేశించడంతో సిబ్బంది ఆమేరకు చర్యలు తీసుకున్నారు. ఆతర్వాత సంబంధిత మండల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. దరఖాస్తు ఫార్వర్డ్ చేయడం మాత్రమే కాకుండా.. నేరుగా తన వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో మండల స్థాయి ముఖ్య అధికారులను జూమ్‌లో ఉంచి వారితో నేరుగా మాట్లాడుతున్నారు. దీంతో గ్రీవెన్స్ ముగిసే వరకు సంబంధిత అధికారులు మండల స్థాయిలో అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన దరఖాస్తులపై కలెక్టర్‌కు సమాధానం ఇస్తున్నారు. ఇది కొంత వరకు సత్ఫలితాలు ఇస్తుండగా, తాజాగా చేసిన ముందస్తు రసీదుల మార్పు విషయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి. అయితే ముందుగా రసీదులు ఇస్తే ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదట అమలు చేద్దామని తర్వాత వచ్చే ఇబ్బందులను సరిచేద్దామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ గణేశ్, పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సానుకూలంగా స్పందించండి
ప్రజావాణికి వచ్చే దరఖాస్తుదారులకు సానుకూల వైఖరితో సమాధానం ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల గురించి దరఖాస్తులు చేసినప్పుడు అర్హత ఉన్నవారు వస్తే ప్రస్తుతం అర్హత ఉన్నప్పటికీ పథకం అమలులో లేదని రాగానే పరిశీలిస్తామని చెప్పాలంటూ సూచించారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు అధికారులపై, ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రతీ గ్రీవెన్స్ దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని దరఖాస్తుదారుడి మొబైల్ నంబరు, దరఖాస్తులోని మొదటి పేజీ స్కాన్ చేసి ఆన్‌లైన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
రసీదు కోసం గంటల తరబడి
వేచి ఉండడమేంటి?
నేను సంతకం పెట్టాక మీకోసం
ఎదురు చూడడం ఎందుకు?
సాఫ్ట్‌వేర్ మార్చండి..
వచ్చేవారం నుంచి అమలు చేయండి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్