చేస్తాం.. చూస్తాం! | - | Sakshi
Sakshi News home page

చేస్తాం.. చూస్తాం!

Jul 15 2025 12:07 PM | Updated on Jul 15 2025 12:07 PM

చేస్తాం.. చూస్తాం!

చేస్తాం.. చూస్తాం!

సమస్యలు పరిష్కరించకుండా అధికారుల అలసత్వం

పరిష్కారం చూపాలని

అర్జీదారుల మొర

గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌కు

119 ఫిర్యాదులు

దరఖాస్తులు స్వీకరించిన

కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు చేస్తాం.. చూస్తాం అంటున్నారే తప్ప పరిష్కరించడం లేదని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఎదుట అర్జీదారులు గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో కమిషనర్‌ ఫిర్యాదులు స్వీకరించారు. ఆక్రమణలు, అతిక్రమణలపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల్లో ముళ్లచెట్లు, మురుగు కూపాలు, దోమలతో అనారోగ్యాల బారిన పడుతున్నామని ఫిర్యాదులు అందజేశారు. నల్లానీళ్లు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. ప్రజాఫిర్యాదులపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని, పలుమార్లు హెచ్చరించినా కొంత మంది సిబ్బంది పట్టించుకోవడం లేదని, శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిష్కారం కాని, పూర్తి చేసిన పనులపై వారంతపు నివేదికలు అందజేయాలని సూచించారు. గ్రీవెన్స్‌కు మొత్తం 119 ఫిర్యాదులు రాగా.. అందులో టౌన్‌ ప్లానింగ్‌కు అత్యధికంగా 62 ఫిర్యాదులు వచ్చాయి. ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు 29, హెల్త్‌, శానిటేషన్‌కు 12, పన్నుల విభాగానికి 14, తాగునీటి సరఫరాకు 1, ఉద్యానవన విభాగానికి 1 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ జోనా, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ మహీధర్‌, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, వెటర్నరీ వైద్యుడు డా.గోపాల్‌రావు, పన్నుల అధికారి రామకృష్ణ, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, ఎంహెచ్‌ఓ రాజేశ్‌, హెచ్‌ఓలు రమేశ్‌, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● హనుమకొండ కృష్ణా కాలనీలో ఖాళీ స్థలాల్లో ముళ్లకంపలు, మురికి కూపాలున్నాయని, దోమలు వృద్ధి చెంది అనారోగ్యంబారిన పడుతున్నామని, ఫాగింగ్‌ చేయాలని కాలనీవాసులు కోరారు.

● దేశాయిపేట 13వ డివిజన్‌లో విశ్వశ్రీ రెసిడెన్సీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, సీలింగ్‌ స్థలమని విచారణ చేపట్టాలని బీఎస్పీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

● 14వ డివిజన్‌ మణికంఠ కాలనీలో సీసీ రోడ్డు అసంపూర్తిగా వేసి, వదిలేశారని పూర్తి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● 11వ డివిజన్‌ రంగంపేటలో 15–2–323 కల్వ ర్టు లేక ఇబ్బందులు పడుతున్నామని, నిర్మించాలని స్థానికులు విన్నవించారు.

● 35వ డివిజన్‌ పుప్పాలగుట్ట లక్ష్మీగణపతి కాలనీలో రెండేళ్ల కిందట సీసీ రోడ్డు కోసం రూ.60 లక్షల నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టడం లేదని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

● ఏనుమాముల 15వ డివిజన్‌ ఆక్యూ వాటర్‌ ప్లాంట్‌ వద్ద వరద, మురుగునీరు స్తంభించిపోతోందని, చర్యలు తీసుకోవాలని స్థానికులు వినతి అందజేశారు.

● 13వ డివిజన్‌ దేశాయిపేటలో 12 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురైందని చర్యలు చేపట్టాలని ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.

● 53వ డివిజన్‌ లష్కర్‌ సింగారంలోని 9 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురైందని చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

● హనుమకొండ గుడిబండల్‌ బావి వద్ద మూడు నెలల కిందట కంకర పోసి, రోడ్డు నిర్మించడం లేదని, రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

● 59వ డివిజన్‌ ఎకై ్సజ్‌ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్‌ వసంత వినతి పత్రాన్ని సమర్పించారు.

● హనుమకొండ రెడ్డిపురంలో ఓ వ్యక్తి ఇళ్ల నడుమ పందులను పెంచుతూ, వదిలేస్తున్నారని అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరారు.

● 36వ డివిజన్‌ జయశంకర్‌, చంద్రవదన కాలనీలో దోమలతో జ్వరాల బారిన పడుతున్నామని, గ్యాంగ్‌ వర్క్స్‌, ఫాగింగ్‌ చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు.

● చింతగట్టు గోశాల వెనుక భాగంలో రోడ్డుపై నిర్మాణాలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

● హనుమకొండ శ్రీనగర్‌ కాలనీలో మూడేళ్లుగా తమకు నల్లా నీళ్లు రావడం లేదని, ఏఈకి ఫిర్యాదు చేసిన ఫలితం లేదని మణెమ్మ ఫిర్యాదు చేశారు.

● భద్రకాళి స్మార్ట్‌సిటీ రోడ్డులో డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతి పత్రాన్ని సమర్పించారు.

● హనుమకొండ 6వ డివిజన్‌లోని ఇంటి నంబరు 5–2–17 నుంచి 10/2/1 వరకు విద్యుత్‌ స్తంభాలు, సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు కోరారు.

● హనుమకొండ స్నేహనగర్‌లో 60 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించారని, తొలగించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

● హంటర్‌ రోడ్డు రుషినగర్‌లోని వేదవతి నిలయం వద్ద సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని వేల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

● హనుమకొండ గుడిబండల్‌ ఇంటి నంబర్‌ 3–7–134/2 నుంచి 139/ 2 వరకు సీసీ రడ్డు లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement