
కమీషన్ల కక్కుర్తి..
అన్నదాతల నుంచి అదనపు వసూళ్లు
వరంగల్ చౌరస్తా : అన్నదాతలకు ఆరుగాలం కష్టపడి పనిచేయడమే తెలుసు. ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో ఏ మాత్రం తెలియదు. ఖరీదుదారు మాట, అడ్తిదారు(కమీషన్ ఏజెంట్లు) సముదాయింపే వాళ్లకు భరోసా. అయితే నమ్ముకున్న వారే అన్నదాతలను అందినకాడికి కమీషన్ల పేరిట దండుకున్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే మార్కెట్ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తిన్న ట్లు వ్యవహరించారు. చివరకు కడుపు మండిన రైతులు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దోపిడీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై ఎట్టకేలకు సోమవారం చర్యలకు ఉపక్రమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
4శాతం కమీషన్ కట్..
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2022–23 సంవత్సరంలో 10 మంది రైతులు తమ పంటలను తరలించారు. సరుకులు అమ్మించేందుకు గాను అడ్తిదారులను ఆశ్రయించారు. అడ్తిదారులు వ్యవసాయ ఉత్పత్తులను అమ్మించినందుకుగాను రూ.100కు రూ.2 చొప్పన కమీషన్ తీసుకోవాలి. కానీ ఏడుగురు అడ్తిదారులు రూ.2కు బదులు అదనంగా మరో 2 శాతం అంటే 4శాతం కమీషన్ కట్ చేసుకుని రైతులకు సొమ్ము చెల్లించారు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు మార్కెట్ అధికారులకు 14 తక్‌పట్టీ ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదుల చేశారు. కానీ మార్కెట్ అధికారులు, సిబ్బంది ఎవరీ నుంచి స్పందన కనిపించలేదు. దీనిపై విసిగివేసారిన రైతులు ఆయా గ్రామాల్లోని కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు వివరాలతో ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకే రెండేళ్ల తర్వాత ఆ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
నోటీసులు, చార్జ్ మెమోలు జారీ
రైతుల నుంచి అధిక కమీషన్ వసూలు చేసిన ఏడుగురు అడ్తిదారులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆ ఏడాదిగా కార్యదర్శిగా పనిచేసిన రాహుల్, గ్రేడ్–2 కార్యదర్శి తోట చందర్, బియ్యాబాని(రిటైర్డ్ గ్రేడ్–2 కార్యదర్శి ), అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణ మీనన్, సూపర్ వైజర్ వెంకన్న నాయక్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చార్జీమెమోలు జారీ చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో పనిచేస్తున్న సూపర్‌వైజర్ దంతాల గంగాధర్, స్వప్పకు ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి చార్జీ మెమోలు జారీ చేశారు. అధిక కమీషన్ల వ్యవహరం మార్కెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వెలుగుచూసిన ఘటనలు ఒకటి, రెండు కాగా, మార్కెట్ యార్డులో రైతులు పెద్ద ఎత్తున మోసాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని తెలంగాణ రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
ఏడుగురు మార్కెట్ అధికారులు, సిబ్బందికి చార్జీ మెమోలు
ఏడుగురు అడ్తిదారులకు నోటీసులు

కమీషన్ల కక్కుర్తి..