
ప్రశ్నించినందుకే మావోయిస్టులను చంపుతారా?
భూపాలపల్లి అర్బన్: మానవ సమాజం ఉన్నంత వరకూ కమ్యూనిజం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే మావోయిస్టులను చంపుతారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని మలుపు నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలో అతిపెద్దన్నారు. ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు ఉంటారని, ఇతర బూర్జువా పార్టీలు వారి ప్రాంతాలకు పరిమితమవుతారన్నారు. ఎప్పటికీ పేదల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీ అన్నారు. 2026 మార్చి వరకు మావోయిస్టులను అంతం చేస్తామని అమిత్ షా చెప్పడం దుర్మార్గమన్నారు. ఒక కమ్యూనిస్టు చనిపోతే 100 మంది జన్మిస్తారని, కమ్యూనిస్టులకు మరణం లేదన్నారు. దోపిడీ ఉన్నంత వరకూ కమ్యూనిజం ఉంటుందన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. జిల్లాలో అనేక సింగరేణి కార్మికుల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. పట్టణంలోని గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సభలో నాయకులు సుధాకర్‌రెడ్డి, శాంతికుమార్, సతీశ్, సుగుణ, రామ్‌చందర్, శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, సమ్మిరెడ్డి, సోతుకు ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు