
సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం
కేయూ క్యాంపస్: అన్ని కమిటీల సమష్టి కృషితోనే కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం విజయవంతమైందని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కేయూ సెనేట్‌హాల్‌లో వివిధ కమిటీలు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల, ఎన్‌సీసీ కేడెట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయం ఇమేజ్ పెంపుదలకు కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టబోతున్నామన్నారు. యూజీలో కూడా ఆన్‌లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టబోతున్నామన్నారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ వరంగల్ యూ ట్యూబ్ చానల్‌ను రిజిస్ట్రార్ వి. రామచంద్రంతో కలిసి ప్రారంభించారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఎన్‌సీసీ కమాండెంట్ కల్నల్ సింథిల్ ఎస్. రమాదురై, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, డీన్లు, విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
అలరించిన ఓరుగల్లు కళాకారుల ప్రదర్శన
హన్మకొండ కల్చరల్ : రెండు రోజులుగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన శ్రీ తనికెళ్ల భరణి రంగస్థల స్వర్ణోత్సవాల్లో భాగంగా తనికెళ్ల భరణి రచనలో వరంగల్‌కు చెందిన ఓరుగల్లు శారదానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ‘చల్‌చల్ గుర్రం’ హాస్యనాటిక అలరించింది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో తనికెళ్ల భరణి.. నాటిక నిర్మాత, నటుడు జేఎన్ శర్మను సన్మానించి మెమోంటో అందజేశారు. నాటిక దర్శకుడిగా సోల్జర్ షఫీ, నటీనటులుగా మహమ్మద్, కోడం సురేందర్, కుసుమ సుధాకర్, గుడివా లహరి నటించారు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
హెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతిగా శ్రీనివాసులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆవిభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్‌రావు కొద్దిరోజుల క్రితం రాజీనామా చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాసులును నియమించారు. నేడు(మంగళవారం) ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆవిభాగానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, విశ్వవిద్యాలయం మహాత్మాజ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. శ్రీనివాసులకు నియామక ఉత్తర్వులు అందజేశారు.

సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం

సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం