కాపాడేవారూ ఉండరు...
టీడీపీ దౌర్జన్యాలపై జనసేన శ్రేణుల తీవ్ర ఆవేదన పవన్ బొమ్మ ఉంటే వాహనాలు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడికి మొర శ్రేణులను కాపాడుకుంటామని భరోసా ఇచ్చిన గాదె
కొల్లూరు: ‘కాపు’ కాసి కుర్చీలో కూర్చోపెట్టిన విశ్వాసం మరచి ఆ వర్గం వారిపైనే టీడీపీ వారు కక్షకట్టి దాడులుకు తెగబడుతున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వద్ద ఈ మేరకు మొర పెట్టుకున్నారు. కొల్లూరుకు చెందిన జనసైనికుడు ఉప్పు జానకిరామయ్య, అతని కుటుంబసభ్యులపై పోలీసు స్టేషన్‌లో జరిగిన దాడి సంఘటనపై డీఎస్పీతో చర్చించేందుకు వచ్చిన జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు శనివారం కొల్లూరు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన వద్ద కాపులపై జరుగుతున్న దాడులను శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి.
వివాదంతో సంబంధం లేకున్నా..
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దెబ్బలు తగిలిన జానకిరామయ్య వెంట తోడుగా వచ్చిన పాపానికి ‘కాపు నా కొడుకులు కనిపిస్తే కొట్టండరా’ అంటూ పోలీసు స్టేషన్‌లోనే తమపై దాడికి దిగితే ఎలా బతకాలని ప్రశ్నించారు. వివాదానికి సంబంధం లేని వ్యక్తులను సైతం కాపు కులం అనే ఒక్క సాకుతో చితకబాదారని, మహిళ అనే విచక్షణ సైతం లేకుండా జనకిరామయ్య సోదరిపై సైతం దాడి చేయడం టీడీపీ శ్రేణుల పైశాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని వాపోయారు. టీడీపీ వర్గీయులు దాడి చేస్తుంటే పోలీసు స్టేషన్ బాత్‌రూమ్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఓ జన సైనికుడు చెప్పుకొన్నారు. అనంతరం రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావుతో దాడి సంఘటన గురించి గాదె చర్చించారు.
జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్‌లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు.


