జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: దివ్యాంగుల జీవితాలకు భరోసా రావాలని, ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ నేరుగా దివ్యాంగుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించడంతోపాటు వారితో ఆప్యాయంగా మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు నాణ్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంలో పదే పదే తిప్పుకోవద్దని సూచించారు. దివ్యాంగులు ఉపాధి కోసం కోరారని, స్వయం ఉపాధి కల్పించేందుకు వివరాలు సమర్పించాలని అధికారులకు తెలిపానన్నారు. మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా, పురుషులకు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి కల్పించి స్వయంగా తమ కాళ్లపై నిలిచే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రాంగణంలో కూలర్లు, తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. అనంతరం అందిన 20 అర్జీలను కలెక్టర్‌తోపాటు డీఆర్వో షేక్ ఖాజావలి, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.దుర్గాభాయి, జిల్లా రిజిస్ట్రార్ శైలజ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగారావు, జిల్లా అధికారులు పరిశీలించారు.
జీఎస్టీ వసూళ్లలో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి
జీఎస్టీ సేకరణ పెంపునకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అన్నారు. జీఎస్టీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ సమన్వయ సమావేశాన్ని ప్రతి నెలా మొదటి శనివారం నిర్వహిస్తామని తెలిపారు. వసూళ్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకరి వద్ద నుంచి మరికరికి అవసరమైన సమాచారాన్ని వేగంగా, సంపూర్ణంగా అందించాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణమూర్తి, జీఎస్టీ జాయింట్ కమిషనర్లు గీతా మాధురి, జాన్ స్టీఫెన్ సన్, ఇతర జి.ఎస్.టి అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నగదు రహిత వైద్యసేవలు అందించాలి
ఎన్.టి.ఆర్ వైద్యసేవ, ఇ.హెచ్.ఎస్ క్రింద నగదు రహిత వైద్యం అందేలా అన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సేవలకు వైద్యులు తప్పని సరిగా అందుబాటులో ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగారావు, డాక్టర్ ఎస్.టి.ఆర్. వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్.విజయప్రకాష్, సభ్యులు రెడ్‌క్రాస్ చైర్మన్ పి.రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.


