తాగునీటి క్లోరినేషన్‌కు ఏర్పాట్లు
ప్రత్తిపాడు: ‘సాక్షి’ కథనంతో పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులు స్పందించారు. మేజర్ గ్రామ పంచాయతీ ప్రత్తిపాడులో ఉన్న మూడు ఫిల్టర్ బెడ్లు పని చేయడం లేదని, ఫిల్టర్ బెడ్లలో ఉన్న నీరు రంగు మారి పాచి పట్టి దుర్వాసన వస్తుండటంతోపాటు చెరువు కట్టపై ఉన్న వన్ ఎంఎల్‌డీ మైక్రోఫిల్టర్‌ను వినియోగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామంలోనికి రా వాటర్ సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయాలపై ఈ నెల 23వ తేదీన ‘సాక్షి’లో గుక్కెడు నీరూ గరళమే.. శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆగమేఘాలపై పంచాయతీ అధికారులు తాత్కాలికంగా ఫిల్టర్ బెడ్లను క్లీన్ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులతో పాచిని తొలగించడంతోపాటు వ్యర్థాలను బయటకు తీయించి మూడు ఫిల్టర్ బెడ్‌లను శుభ్రపరిచారు.
నేటి నుంచి క్లోరినేషన్..
అంతే కాకుండా నేటి నుంచి గ్రామంలోనికి సరఫరా చేసే ముందుకు నీటిని కచ్చితంగా క్లోరినేషన్ చేయనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. చెరువుల నీరు ఎండల తీవ్రతకు తగ్గుతుండటంతో టర్బిడిటీ శాతాన్ని తగ్గించనున్నారు. శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రత్తిపాడులో ఉన్న మూడు ఫిల్టర్ బెడ్లు పనిచేయడం లేదని, మైక్రో ఫిల్టర్ పనిచేస్తుందని తెలిపారు.
మూడు స్లో శాండ్ ఫిల్టర్లును వినియోగంలోనికి తెచ్చేందుకు రూ.80 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి స్థానిక ఎమ్యెల్యే ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్‌కు పంపామన్నారు. జిల్లా ప్రజా పరిషత్ నిధులతో సంబంధిత పనులు చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిధుల మంజూరైన వెంటనే ఫిల్టర్‌బెడ్ పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టి, గ్రామం మొత్తానికి అవసరమైన పరిమాణంలో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.


