యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి | - | Sakshi
Sakshi News home page

యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి ముగిసిన జిల్లా స్థాయి చెస్‌ పోటీలు రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు బాల బాలికలు ఎంపిక ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం

ఈగల్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ

తాడేపల్లి రూరల్‌: యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని ఈగల్‌ ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఫ్యాక్టరీ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–2 క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్‌ వద్దు బ్రో–క్రికెట్‌ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, విజయాలను సాధించడానికి క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. టోర్నమెంట్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్‌ ఎస్పీ కె.నగేష్‌బాబు, డీఎస్పీ ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ఎ.శాంతిరాజు, శ్వాస ఆర్గనైజేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ అనిత జ్యోతి పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన వేంకటేశ్వర బాల కుటీర్‌ పాఠశాలలో జరుగుతున్న మెన్‌ అండ్‌ విమెన్‌ టీమ్‌ చాంపియన్‌ షిప్‌– 2026 పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఆద్యంత రామన్‌ నాయుడు, కేజీ అఖిల్‌, కె.హర్షవర్ధన్‌, ముక్కుపాటి చేతన్‌, ఉమెన్‌ విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, అనన్య గొల్లపల్లి, కంచర్ల అంజుశ్రీలు విజయం సాధించారు. పోటీల నిర్వాహకుడు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గెలుపొందిన ఎనిమిది మంది రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రవీంద్రరాజు, బాలకుటీర్‌ సీఏఓ దుర్గా రఘురామ్‌, ప్రిన్సిపాల్‌ సుధామాధవి బహుమతులు ప్రదానం చేశారు. అర్బిటర్‌గా అనిల్‌ వ్యవహరించారు.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): కర్నూలులో ఈ నెల 24న జరిగే 12వ సీనియర్‌ రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పది మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి షేక్‌ ఖాజామొహిద్దీన్‌ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెహబూబ్‌ షంషేర్‌ ఖాన్‌ మెమోరియల్‌ ఇండోర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కోచ్‌ నాంచారమ్మ, నాగేశ్వరరావుల పర్యవేక్షణలో గుంటూరు జిల్లా జట్టు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు గుంటూరు జిల్లా నుంచి సీహెచ్‌ గౌతమ్‌, మేదర నాగచైతన్య, బి.నాగ చైతన్య, బి.స్వర్ణసుజిత్‌, కే అభినవసాగర్‌, అకిశెట్టి విష్ణుదేవరాయలు, షేక్‌ నస్రిన్‌, షేక్‌ నజరీన్‌, లక్ష్మీపావని, జి.జాన్వీలు ఫ్రీ స్టైల్‌, బ్యాక్‌ స్ట్రోక్‌, బ్రస్ట్‌ స్ట్రోక్‌, బటర్‌ ఫ్లై విభాగాలలో ఎంపికై నట్లు వెల్లడించారు.

బాపట్ల: ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆదివారం బాపట్ల జిల్లా కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదామును జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌ గౌడ్‌తో కలసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ గోదాం వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్‌ షేక్‌ సలీమా, ఎన్నికల పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement