విద్యాశాఖలో విభజన పర్వం | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖలో విభజన పర్వం

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల విభజనకు కసరత్తు జూన్‌ మొదటి వారంలో ఉపాధ్యాయుల ఆప్షన్లు నమోదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 15 వేల మంది ఉపాధ్యాయులు అన్ని విభాగాల్లో పని చేస్తున్న వారి సీనియార్టీ జాబితా విడుదల

పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఆయా జిల్లాల వారీగా కేటాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్‌ మొదటి వారంలో ఉపాధ్యాయుల నుంచి ఏ జిల్లాకు ఎవరు వెళతారనే విషయమై ఆప్షన్లు నమోదుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌ : కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో సంబంధం లేకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా డీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల నిర్వహణ, టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ వంటి అంశాలు ఆయా డీఈవో కార్యాలయాల నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు వ్యవహారాలు, నియామకాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన చేపడుతున్నారు. కొత్త జిల్లాలను కేంద్ర నోటిఫై చేసి, గెజిట్‌ విడుదల చేయడంతో ఆయా జిల్లాల వారీగా విద్యాశాఖలో విభజనకు అడుగులు పడుతున్నాయి.

జాబితా ప్రకటన

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, నగరపాలక సంస్థ, మున్సిపల్‌ యాజమాన్యాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధ్యాయ పోస్టులను ఆయా జిల్లాల వారీగా విభజించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కేటగిరీల వారీగా 15 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో ఆయా జిల్లాల వారీగా ప్రభుత్వ వాస్తవంగా మంజూరు చేసిన పోస్టులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలను విభజన ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులతో కూడిన సీనియార్టీ జాబితాను అధికారులు ప్రకటించారు. ప్రతిని గుంటూరు డీఈవో అధికారిక సైట్‌లో పొందుపర్చారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించేందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో మంజూరైన పోస్టులు, క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీలను పరిగణనలోకి తీసుకుని విభజన దిశగా ముందుకు వెళ్లనున్నారు.

వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు

జూన్‌లో ఉపాధ్యాయులకు రెండు విడతలుగా వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆ తరగతుల్లో భాగంగా ఏ జిల్లాలో పని చేసేందుకు ఎవరు వెళతారనే విషయమై ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు నమోదు చేయించనున్నారు. దీంతో జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయించి, ఇక పూర్తిగా జిల్లాస్థాయిలోనే ఉపాధ్యాయుల సర్వీసు సంబంధిత వ్యవహారాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టేందుకు ఆస్కారముంది.

Advertisement
 
Advertisement
Advertisement