తమ్ముళ్లకు మార్కెట్‌ మామూళ్లు? | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు మార్కెట్‌ మామూళ్లు?

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

నెహ్రూనగర్‌: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న డాక్టర్‌ కొల్లి శారద హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లోని షాపులను నిబంధనల ప్రకారం టెండర్‌లో దక్కించుకున్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక రేటుకు షాపులను పాడుకుని దక్కించుకుంటే ఇప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు మార్కెట్‌ పాత లీజుదారులతో కుమ్మక్కయ్యారు. అనధికారికంగా బొంతపాడు వద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ నిర్వహిస్తున్నారని ప్రస్తుత లీజుదారులు ఆరోపిస్తున్నారు. గత నెల 20వ తేదీ నుంచి అనధికారికంగా మార్కెట్‌ నిర్వహిస్తున్నారని నగర కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.4 కోట్ల ఆదాయానికి గండి

గతేడాది ఆగస్టులో కొల్లి శారద మార్కెట్‌లో షాపుల వేలం పాట జరిగింది. ఇందులో చాలా మంది కొత్త వారు పాల్గొన్నారు. రూ.లక్షలు వెచ్చించి షాపులను దక్కించుకున్నారు. దీని ద్వారా కార్పొరేషననుకు దాదాపు రూ.4 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అయితే షాపులు రాకపోవడంతో పాత లీజుదారులంతా కలిసి తూర్పు నియోజకవర్గ టీడీపీ నేతలను కలిసి బొంతపాడులో అనధికారికంగా మార్కెట్‌ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని వల్ల కొల్లి శారద మార్కెట్‌లో అశించిన స్థాయిలో వ్యాపారం జరగకపోవడంతో కార్పొరేషన్‌ ఆదాయానికి గండి పడే అవకాశం లేకపోలేదని కొత్త లీజుదారులు వాపోతున్నారు.

రూ.2 కోట్లు వసూలు?

బొంతపాడులో మార్కెట్‌ నిర్వహించేందుకుగాను పాత లీజుదారులంతా కలిసి రూ.2 కోట్లు వరకు సమకూర్చినట్లు సమాచారం. వాటిని టీడీపీలో ముఖ్య నాయకులైన వారికి రూ.1.50 కోట్లు సమర్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతోనే అనధికారికంగా మార్కెట్‌ నడుస్తున్నప్పటికీ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని కొత్త లీజుదారులు ఆరోపిస్తున్నారు.

కొల్లి శారద

మార్కెట్‌

కొల్లి శారద మార్కెట్‌కు పోటీగా

మరో చోట ఏర్పాటుకు సహకారం

నిబంధనల ప్రకారం నగర పరిధిలో

ఒక్క హోల్‌సేల్‌ మార్కెట్‌కే అవకాశం

అనధికారికంగా మరొక మార్కెట్‌

బొంతపాడులో నిర్వహణ

రూ.లక్షలు పెట్టి కొల్లి శారద

మార్కెట్‌లో షాపులు

దక్కించుకున్న వారికి నష్టం

అధికార పార్టీ నేతలకు అందిన

రూ.1.50 కోట్లు, అధికారులకు

రూ.50 లక్షలు?

అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించిన

కొల్లి శారద మార్కెట్‌ లీజుదారులు

Advertisement
 
Advertisement
Advertisement