జీజీహెచ్‌లో డయాలసిస్ అందక
● పనిచేయని మిషన్లు ● అత్యవసరమైతే విజయవాడ తరలింపు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో డయాలసిస్ చికిత్స అందక ఓ మహిళ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు సోషల్ మీడియాలో శనివారం న్యూస్ వైరల్ అయింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు అత్యవసరంగా డయాలసిస్ అవసరమైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే సమయానికి చికిత్స అందకపోవడంతో ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపించారు. కాగా ఈ విషయంపై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా డయాలసిస్ చేస్తున్న సమయంలో ఇతర అనారోగ్యంతో పాటు, గుండె సంబంధిత సమస్య తలెత్తి రోగి మృతి చెందినట్లు వివరణనిచ్చారు.
మూలకు చేరిన డయాలసిస్ మిషన్లు
గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ రోగులకు బుధవారం, శనివారం ఓపీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక్కోరోజు వంద నుంచి 150 మంది కిడ్నీ రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 10 నుంచి 20 శాతం మందికి తప్పనిసరిగా డయాలసిస్ అవసరం అవుతుంది. నెఫ్రాలజీ వార్డులో డయాలసిస్ మిషన్లు నాలుగు ఉన్నా అవి సక్రమంగా పనిచేయడం లేదు. కొన్ని రోజులుగా డయాలసిస్ మిషన్లు పనిచేయక గుంటూరు జీజీహెచ్‌కు వచ్చిన రోగులను కిడ్నీ వైద్యులు విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రికి డయాలసిస్ చికిత్స కోసం రిఫర్ చేస్తున్నారు. కొంతకాలంగా డయాలసిస్ మిషన్‌లకు అవసరమైన ఆర్వో ప్లాంట్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈనెల మొదటి వారంలో డయాలసిస్ యూనిట్‌లోని ఆర్వో ప్లాంట్లు మరమ్మతులు చేయించారు. దీర్ఘకాలికంగా ఆర్వో ప్లాంట్లు పనిచేయక పోవడం వలన డయాలసిస్ మిషన్లు మొరాయిస్తున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు.


