టీడీపీ జిల్లా అధ్యక్షుడే ఆ పనిచేస్తే సామాన్య కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో అర్ధం చేసుకోవచ్చు
నీతులు చెప్పే హోం మంత్రి అనిత ఏం చేస్తోంది?
బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని బహిరంగంగా బెదిరించిన వారిని వెంటనే శిక్షించాలి
జరిగిన సంఘటనపై కేసు నమోదు చేయాలి
డిమాండ్ చేసిన వైఎస్సార్ సీపీ, ప్రజా సంఘాల నాయకులు
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు బహిరంగంగా కత్తులు, గొడ్డళ్లు పట్టుకుని తిరిగినా ఎటువంటి కేసులు నమోదు చేయరు. ఎవరైనా వేరేపార్టీ వారు మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేసి వెంటనే రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఒక నాయకుడు గొడ్డలి పెట్టుకుని నరుకుతానని బహిరంగంగా మాట్లాడినా ఎటువంటి చర్యలు లేవని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నత్త యోనారాజు, రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వరరావు గొడ్డలి పట్టుకుని బెదిరించిన విషయమై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం నత్త యోనారాజు, కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ టీడీపీ వారు వైఎస్సార్ సీపీని గొడ్డలి పార్టీ అంటూ విష ప్రచారం చేస్తున్నారని, అయితే కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా చేయగా, స్వయంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గొడ్డలిని గాలిలో ఊపుతూ వైఎస్సార్ సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నరికేస్తామంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశాడన్నారు. ఇంత చేసినా అతనిపై చర్యలు లేవన్నారు. ఇలా బహిరంగంగా గొడ్డలి పట్టుకుని తిరిగి ప్రజలను, అధికారులను, ప్రతిపక్షాల వారిని భయపెడుతున్న పార్టీ తెలుగుదేశంఅని, వారిది బాంబుల పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్సీ కులానికి చెందిన ఎంతోమందిని తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రవర్ణ నాయకులు బహిరంగంగా నడిరోడ్డుపై నరికి చంపారని, రాష్ట్రంలో హోం మంత్రి అనితమ్మ కనీసం ఇలాంటి సంఘటనపై నోరు మెదపడం లేదు. వైఎస్సార్ సీపీ వారు సినిమా డైలాగులు చెబితే వారిపై పీడీ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేశారని, మరి ఇప్పుడు గొడ్డలి పెట్టుకుని తిరిగిన మీ పార్టీ కర్నూలు అధ్యక్షుడిపై వెంటనే కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, న్యాయవాది బండిరేవు వెంకట నారాయణ రెడ్డి, చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి గంజి షణ్ముఖ్, జిల్లా బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బత్తుల దాసు తదితరులు పాల్గొన్నారు.


