ఉమ్మడి గుంటూరు జిల్లాకు 11,013 క్వింటాళ్ల కేటాయింపు
కొరిటెపాడు(గుంటూరు): పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెసిందే. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రీయ పదార్ధం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై వీటిని అందిస్తోంది. తాజాగా రాయితీ ధరలను ఖరారు చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా(గుంటూరు, పల్నాడు, బాపట్ల)కు 11,013 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. అందులో గుంటూరు జిల్లాకు 265 క్వింటాళ్ల జీలుగ, 417 క్వింటాళ్ల జనుము, 985 క్వింటాళ్ల పిల్లిపెసర కలిపి మొత్తం 1,667 క్వింటాళ్లు కేటాయించారు. పల్నాడు జిల్లాకు 2,890 క్వింటాళ్లు జీలుగ, 1,900 క్వింటాళ్లు జనుము, 2,304 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 7,094 క్వింటాళ్లు కేటాయించారు. అలాగే బాపట్ల జిల్లాకు 882 క్వింటాళ్లు జీలుగ, 630 క్వింటాళ్లు జనుము, 740 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తంగా 2,252 క్వింటాళ్లు కేటాయించారు. వీటిని 50 శాతం రాయితీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు.
గరిష్టంగా ఐదు బ్యాగులు...
జీలుగ విత్తనాలు కిలో పూర్తి ధర రూ.160 కాగా, 50 శాతం రాయితీతో రూ.80 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే జనుము విత్తనాల కిలో పూర్తి ధర రూ.154 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.77 చెల్లించాలి. పిల్లిపెసర పూర్తి ధర రూ.196 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.98 చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగ, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్ల కింద ఎకరా లోపు రైతులకు ఒక బ్యాగ్, రెండు ఎకరాలకు రెండు బ్యాగులు, మూడు ఎకరాలకు మూడు బ్యాగులు, నాలుగు ఎకరాలకు నాలుగు బ్యాగులు, ఐదు ఎకరాలు, అంత కన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగులు పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో జీలుగ, జనుములు నాలుగు కిలోలు చొప్పున, పిల్లిపెసర రెండు కిలోలు ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్ కిట్ పూర్తి ధర 1,648 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.824లు చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే)లో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ సీడ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా మేనేజర్ పి.సుమలత శనివారం ‘సాక్షి’కి వివరించారు.


