స్థిరాస్తి వెంచర్లకు రాజధాని నల్లమట్టి | - | Sakshi
Sakshi News home page

స్థిరాస్తి వెంచర్లకు రాజధాని నల్లమట్టి

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

తరలిపోతున్న వేలాది లారీల నల్ల బంగారం రూ. కోట్లలో జేబులు నింపుకొంటున్న తమ్ముళ్లు పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు

తాడికొండ: రాజధానిలో వాగులు, రిజర్వాయర్‌ల పేరిట తొలగిస్తున్న నల్లమట్టిని అధికార పార్టీకి చెందిన నాయకులు వాటాలు వేసుకొని మరీ విక్రయిస్తున్నారు. తద్వారా రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. నల్లమట్టికి మంచి డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా బడా బాబులకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు వేల లారీలలో మట్టి తరలించి స్థలాలను చదును చేస్తున్నారు. వీరికి తోడు రైతులు పంట పొలాలను చదును చేసుకునేందుకు అరకొరగా తోలించుకుంటుండగా ఖాళీ స్థలాలకు కూడా మట్టి భారీగా తరలిస్తున్నారు. పోలీసులు, విజిలెన్స్‌, మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు ఇదేమీ కనిపించక పోవడం విడ్డూరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో పెద్ద డంపర్‌ లారీకి రూ.6 వేలు – రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు.

పల్లపు ప్రాంతమైనా...

ప్రభుత్వం సమీకరించిన భూములలో మట్టిని రాజధాని అవసరాలకు వదిలేసి పక్క మండలాలకు వేల ట్రిప్పుల్లో తరలించడం పట్ల పలువురు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతం అసలే పల్లం కావడంతో చినుకు పడితే చిత్తడిగా మారి జల సంద్రాన్ని తలపించి రోడ్లపై ప్రయాణాలు కూడా నిలిచిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో పల్లపు ప్రాంతాలకు ఈ మట్టిని తరలిస్తే మంచిదే కానీ బయటకు విక్రయించి రూ. కోట్ల సంపాదనను ప్రైవేటు వ్యక్తులు జేబులో నింపుకోవడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం పేరేచర్ల ప్రాంతం నుంచి తరలించే కంకర, గ్రావెల్‌ ఇతర నిర్మాణ సామగ్రి తరలించే లారీలతో పాటు అక్రమ ఇసుక తరలింపు, ఇతర వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. దీనికి తోడు లారీల డ్రైవర్‌లు ఇష్టారీతిగా స్పీడు పెంచి నడుపుతుండటం స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది. ఇప్పటికే ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోగా, అధిక లోడులతో వెళుతున్న లారీల కారణంగా రాజధానికి వెళ్లే ప్రధాన రహదారితోపాటు పలు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. శుక్రవారం పెదపరిమి సెంటర్‌లో ఓ లారీ డ్రైవర్‌ అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి కారణం అవడంతో స్థానికులు లారీని నిలిపివేశారు. రోడ్లపై నిత్యం వేల లారీల సంచారంతో గ్రామాల్లో కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కంకర, ఇసుక, నల్లమట్టి పడి వాహనదారులు జారిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. అక్రమ మట్టి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement