గుండెకు ఊపిరందడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

గుండెకు ఊపిరందడం లేదు..

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

గుండెకు ఊపిరందడం లేదు..

జీజీహెచ్‌లో ప్రాణాలతో చెలగాటం!

గుండెజబ్బుల విభాగంలో

పనిచేయని ఏసీలు

ఫ్యాన్లు తెచ్చుకుంటున్న పేషెంట్లు

చెమటోడ్చి వైద్యులు చికిత్స అందిస్తున్నా.. అధికారుల్లో చలనం కనిపించడం లేదు..

నెలల తరబడి సమస్య

గుంటూరు మెడికల్‌: పాలకులు, అధికారుల నిర్లక్ష్యం పేదల రోగులకు ప్రాణసంకటంగా మారింది. పేదల వైద్యశాల జీజీహెచ్‌లో వసతులు కరవయ్యాయి. అత్యంత కీలకమైన గుండె శస్త్ర చికిత్స విభాగంలో ఏసీలు పనిచేయడం లేదు. అసలే వేసవి కాలం. గుండె ఒక్క నిమిషం ఆగిందంటే మనిషి ప్రాణాలు గాలిలో కలిసినట్లే. పేదలు అవస్థలు పడుతున్నారు. చికిత్స మాత్రమే అందిస్తాం.. వసతులు మమ్మల్ని అడగొద్దు అన్నట్లుగా ఆసుపత్రి అధికారుల తీరు ఉంది.

తప్పనితిప్పలు..

గుంటూరు జీజీహెచ్‌లో గుండె జబ్బు రోగులకు అవస్థలు తప్పడం లేదు. గుండె జబ్బుతో వైద్యశాలకు వస్తే అక్కడ ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, మేల్‌ కార్డియాలజీ, పోస్ట్‌ క్యాథల్యాబ్‌ వార్డుల్లో ఏసీలు మరమ్మతులకు గురయ్యాయి. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గదిలో ఏసీలు పనిచేయక ఊపిరందక నానా అగచాట్లు పడుతున్నారు. గుండె జబ్బు రోగులకు సరిపడ గాలి, వెలుతురు లేని పక్షంలో ఊపిరి అందక ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

సమస్య ఎందుకంటే...

ఏసీల మరమ్మతులు, మెయింటెనెన్స్‌ కార్యాలయ అధికారులు, ఉద్యోగుల మధ్య వాటాల కోసం వివాదాలు ఏర్పడి గాలికొదిలేశారు. ఫలితంగా ఆస్పత్రిలో పలు వార్డుల్లో ఏసీలు పనిచేయక రోగులు అల్లాడి పోతున్నారు. మార్చి ప్రారంభానికి ముందే ఏసీలన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది. ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లాంటి అత్యవసర వైద్య సేవల విభాగాాల్లో 365 రోజులు ఏసీల వినియోగం తప్పనిసరి. ఆస్పత్రిలో రెగ్యులర్‌గా ఏసీల వినియోగం ఉన్నా వాటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఏసీల మరమ్మతుల కాంట్రాక్టర్‌పై ఆస్పత్రి అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడం విమర్శలకు తావిస్తుంది. రోగులు ఇబ్బంది పడుతున్నప్పుడైనా కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలుపుదల చేయడం, లేదా అతడిని పక్కన బెట్టి వేరొకరికి కాంట్రాక్టు అప్పగించి రోగులకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆస్పత్రి అధికారులకు సంబంధించిన గదుల్లో ఏసీలు బాగానే పనిచేస్తున్నాయి.

వైద్యులు, వైద్య సిబ్బంది కష్టపడుతున్నా...

హార్ట్‌ ఫెల్యూర్‌ లాంటి తీవ్ర ప్రాణాపాయ స్థితిలో గుంటూరు జీజీహెచ్‌ గుండె జబ్బుల వార్డుకు వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చమటోడ్చి సేవలందిస్తున్నారు. ఎక్కువ సేపు వైద్య విభాగంలో సేవలందించేలా ఆస్పత్రి అధికారులు ఏసీలు రిపేర్లు చేయించకపోవడంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధిక సంఖ్యలో గుండె ఆపరేషన్లు చేస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది రికార్డులు సృష్టిస్తున్నా ఆస్పత్రి అధికారులు వారికి ప్రశాంతమైన చల్లటి వాతావరణంలో విధులు నిర్వహించేలా వసతులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, ఏసీలు పనిచేయని గదుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులతో ఊపిరాడక ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

జీజీహెచ్‌ గుండె జబ్బుల విభాగం క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌(సీసీయూ)లో చికిత్స కోసం వచ్చే రోగులు నెలల తరబడి ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి కొంతమంది ఫ్యాన్లు తెచ్చుకుని పెట్టుకుంటున్నారు. ఫ్యాన్లు కొనుగోలు చేసే స్థోమత లేని వారు మాత్రం గాలిక ఆడక, నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవికి ముందే ఆస్పత్రిలో ఏసీల నిర్వహణ చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వలన రోగులకు ఇబ్బంది వస్తుందని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement