జలధారలో 590 పనులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జలధారలో 590 పనులు ప్రారంభం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

గుంటూరు వెస్ట్‌: జలధార – జల హారతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 590 పనులు ప్రారంభ మయ్యాయని జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి అధికారులతో కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 718 పనులు మంజూరయ్యాయని తెలిపారు. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి చేసి నీటిని నిలువ చేసేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని, భూగర్భ జలంగా మారాలని అన్నారు. జిల్లాలో చెరువుల నీటి సామర్థ్యం మేరకు నీరు నిలవ జరగాల్సిందేనన్నారు. నీటి వసతులలోకి నీరు పారుదలకు ఏ ఆటంకం లేకుండా కాలువల్లో పూడికలు తీయాలని, గట్లను బలోపేతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులను చేపట్టడం జరుగుతుందని, సంబంధిత సిబ్బంది పక్కాగా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రజలను పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. నీటి వనరుల పరిరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి మండలంలో చిన్న నీటి తరహా చెరువులు, వాటికి సంబంధించిన ఫీడర్‌ కాలువలను పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గత ఆరు నెలల్లో భూగర్భ జలాలు, ప్రస్తుత భూగర్భ జలాలు విశ్లేషించి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న మండలాల్లో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార జలహారతి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. కాలువలపై ఆక్రమణలు, కాలువలు మూసుకుపోవడం, లేదా పంటలు వేసి వాటిని వినియోగించడం వంటి అంశాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫీడర్‌ కాలువలను పూర్తిగా పునరుద్ధరించి భూగర్భ జలాలు పెంచాలని కలెక్టర్‌ వివరించారు.

జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ

Advertisement
 
Advertisement
Advertisement