నగరంపాలెం: గుంటూరు రేంజ్ పరిధిలో విధి నిర్వహణలో ఆరోపణలున్న పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు పూర్తిచేసేందుకు గురువారం గుంటూరు నగరంపాలెంలోని పోలీస్ కల్యాణ మండపంలో మౌఖిక విచారణ (ఓఇ) మేళా నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మేరకు మేళా జరగ్గా, డీఎస్పీలు విచారణాధికారులుగా వ్యవహరించారు. ఆరోపణలున్న పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్‌ఐలను వ్యక్తిగతంగా విచారించి, కేసుల వివరాలు, ఆధారాలను పరిశీలించారు. ఈ మేరకు పోలీస్ అధికారులపై ఆరోపణలను చట్టపరంగా, శాఖాపరంగా పరిష్కరించనున్నారు. అవసరమైతే శిక్షలు విధించడం లేదా క్లియర్ చేసి అధికారులను విధుల్లోకి తీసుకునేందుకు మేళా సాధ్యమవుతుందని పోలీస్ అధికారులు అన్నారు. మేళాలో డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అలహారి శ్రీనివాస్ (ఎస్‌బీ), బాలమురళీకృష్ణ, చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యం, రాయపాటి శ్రీనివాస్, ఐజీ కార్యాలయ మేనేజర్ హిమంతరావు పాల్గొన్నారు.


