మేడికొండూరు: పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త, నాయకుడి కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. మేడికొండూరు గ్రామానికి చెందిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ రోడ్డు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. బాజీ కుటుంబ సభ్యులను పార్టీ కృష్ణా – గుంటూరు జిల్లాల పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, నిమ్మకాయల రాజనారాయణ కలిసి అంబటి రాంబాబు పరామర్శించారు. బాజీ కుటుంబ సభ్యులకు రూ.3.50 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన షేక్ బాజీ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని, పార్టీకి తీరని లోటు అని చెప్పారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వారివెంట మేడికొండూరు మండల జెట్పీటీసీ సభ్యుడు కందుల సిద్దయ్య, పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆవుల రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరు వంశీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఉడతా ప్రభాకర్, గ్రామ అధ్యక్షుడు కొరివి చెన్నయ్య, బీవీ సుబ్బారెడ్డి, పాములపాటి జయరావు, మన్నవ బ్రహ్మయ్య, సంకు రత్తయ్య, మహమ్మద్ ఆరిఫ్, షేక్ సుభాని, చంటి, బాజీ, జానీ బాష, నాగులు మీరా, తూమాటి మురళి, మక్బుల్ తదితరులు ఉన్నారు.


