రైతులపై అట్రాసిటీ కేసు నమోదు దారుణం | - | Sakshi
Sakshi News home page

రైతులపై అట్రాసిటీ కేసు నమోదు దారుణం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

కాపు నాయకుడు వంగవీటి నరేంద్ర

పొన్నూరు: మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన రైతులపై టీడీపీ నాయకులు దాడి చేయడమే కాకుండా, వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడం దుర్మార్గమని కాపు నాయకుడు వంగవీటి నరేంద్ర అన్నారు. గురువారం ఈనెల 5వ తేదీన మామిళ్లపల్లిలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ అనుచరులు చేసిన దాడిలో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. షట్టర్‌ పగలగొట్టిన రేకుల షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైన ఎమ్మెల్యే నరేంద్ర, వారిపైనే దాడులకు ప్రోత్సహించడం దారుణమని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ కాపులను అణగదొక్కేందుకే టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. రాజకీయంగా అంబటి మురళీకృష్ణను ఎదుర్కోలేక, అబద్దపు ఆరోపణలతో ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుమాలిన చర్యని విమర్శించారు. కాపులనే లక్ష్యంగా పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వేధింపులకు పాల్పడుతున్నారని, మామిళ్ళపల్లిలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం అన్నారు. వెంటనే కాపు రైతులపై పెట్టిన అక్రమ కేసులు రద్దుచేసి, సీజ్‌ చేసిన రేకుల షెడ్డును రైతులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పొన్నూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఆకుల వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ నాజర్‌, పార్టీ నియోజకవర్గ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షుడు అక్కిరెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, బాధిత రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement