● సెలవు ఇవ్వడం లేదని అక్కసుతో
పైపులు తగులబెట్టిన వాచ్‌మన్
● సాంకేతిక ఆధారాలతో ప్రత్యేక
బృందాలతో కేసును ఛేదించిన పోలీసులు
● ఘటనను వైఎస్సార్‌సీపీపై మోపేందుకు
యత్నించిన టీడీపీ నేతలు అబాసుపాలు
తాడికొండ: రాజధాని ప్రాంతంలో అగ్నిప్రమాదం ఘటనలో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు, రోడ్లు, కాల్వల నిర్మాణం, తదితర పనులు చేపడుతున్న మెఘా ఇంజినీరింగ్ సంస్థ వారి పనులకు కావాల్సిన సామగ్రిని పలు ప్రాంతాల్లో నిల్వ చేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని జోన్–6 బ్లాక్ –3లో ఈ–4, ఎన్–12 జంక్షన్ వద్ద ఆరు ఎకరాల ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ పనులకు కావాల్సిన పైపులు స్టాక్ యార్డులో ఉంచారు. వీటికి కాపాలాగా తుళ్లూరు ప్రాంతానికి చెందిన తిప్పగుడిసె రాముని ఉంచారు. ఈనెల 23న రాత్రి అవి తగలబడిన ఘటనపై నమోదైన కేసును పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలను ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో చేపట్టిన విచారణలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దొండపాడు గ్రామానికి చెందిన తిప్పగుడిసె రాము అలియాస్ అర్లప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే ఈ ఘటనకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. 23వ తేదీ ఉదయం సూపర్‌వైజర్ హనుమంతరావుకు ఫోన్ చేసి తనకు విరేచనాలు అవుతున్నాయని, సెలవు కావాలని అడగ్గా, షిఫ్ట్ మార్పు ఉన్నందున 24 గంటలు విధులు నిర్వహించాలని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన వాచ్‌మన్ రాము జనరేటర్‌లో డీజిల్ నింపడానికి ట్యాంకర్ వచ్చిన సమయంలో ఖాళీ బాటిల్‌తో పైపు ద్వారా డీజిల్ తీసి అక్కడ ఉన్న పైపుల మధ్య దాచి రాత్రి 8.45 గంటల సమయంలో డీజిల్ పోసి ఎండుగడ్డితో నిప్పింటించాడు. మంటలు వ్యాపించాక అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని, చూపించే ప్రక్రియలో భాగంగా మంటలు లేని వైపు ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి, తరువాత మంటలను వ్యాపించిన ఫొటోలు తీసి సమాచారం అందించాడు. పోలీసులు ఆ ఫొటోను నిశితంగా పరిశీలించగా, వెనుక మంటలు అంటుకున్నట్లు ఎర్రటి కాంతి కనబడడంతో నిందితుడిని గట్టిగా ప్రశ్నించారు. దీంతో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిప్పు పెట్టి దానిని ఆర్పి వేసి, సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేయవచ్చనే ఆలోచనతో ఈ నేరానికి పాల్పడ్డాడని నిందితుడు తెలిపాడని, అయితే ఈ కేసులో ఏదైనా కుట్ర కోణం ఉందా, ఎవరైనా ఇతరులు కూడా భాగస్వాములు అయ్యారనే దానిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, డీజిల్ తీయడానికి వాడిన పైపు, ఒక లైటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీ నేతలపై మోపేందుకు యత్నించిన టీడీపీ నేతలు అబాసుపాలయ్యారు.


