తెనాలి సమీపంలోని ప్రస్తుతం బాపట్ల జిల్లా అమృతలూరు మండల గ్రామం పెదపూడి ఉమేష్‌చంద్ర జన్మస్థలం. 1966 మార్చి 29న జన్మించారు. తలిదండ్రులు చదలవాడ నయనతార, వేణుగోపాలరావు. తాత చదలవాడ ఉమామహేశ్వరరావు జస్టిస్ పార్టీ నాయకుడు. తెనాలి తాలూకా బోర్డు అధ్యక్షులుగా పనిచేశారు. అమ్మ తరఫు తాత తుమ్మల జగన్మోహనరావు వ్యాపారవేత్త. తండ్రికి ఆల్విన్ ఫ్యాక్టరీలో సర్వీసు మేనేజరు ఉద్యోగం కారణంగా ఉమేష్‌చంద్ర బాల్యం హైదరాబాద్‌లో గడచింది. నిజామ్ కాలేజీలో బీఏ, ఉస్మానియా యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో ఎంఏ చేశారు. బీఏలో యూనివర్శిటీ టాపర్‌గా బంగారుపతకం, ఎంఏలో మేఽథ్స్, ఎకనామిక్స్‌లోనూ బంగారుపతకాలను గెలిచారు.
1991లో ఐపీఎస్‌కు ఎంపికై ముస్సోరిలో శిక్షణ అనంతరం వరంగల్ ఏఎస్‌పీగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు కార్యకలాపాలకు పేరొందిన వరంగల్‌లో విధినిర్వహణ కత్తిమీదసాము అయినప్పటికీ నిజాయతీ కలిగిన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. మావోయిస్టుల అణచివేత ఆపరేషన్స్‌లో ధైర్యంగా పాల్గొంటూ వచ్చారు. ఒక్కోసారి పోలీసు బృందాలకు నాయకత్వం వహించి నడిపించారు. సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలతో మావోయిస్టులపై పలు విజయాలను సాధించారు. రూరల్ ఏఎస్‌పీగా ‘జనజాగృతి’ పేరుతో సాంస్కృతిక బృందాలను రూపొందించి మావోయిస్టు చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనిని ఇతర జిల్లాలకూ విస్తరించారు.
తర్వాత కడప జిల్లాకు బదిలీపై వెళ్లి, అక్కడ ‘కామన్‌మ్యాన్ పోలీసు ఆఫీసర్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. మళ్లీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా వరంగల్ జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడా క్రిమినల్స్ భరతం పట్టారు. సాధారణ ప్రజలకు సహకారం అందిస్తూ, పోలీసులకు స్ఫూర్తిగా నిలిచారు. మారుమూల మందుపాతరలకు అవకాశం వున్న ఏరియాల్లోనూ ఏమాత్రం వెరపులేకుండా పర్యటించారు. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టేందుకు తనదైన ప్రణాళికలతో ముందుకు సాగారు. వీరి ప్రతిభ, అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ఆయనకు ఎస్‌పీగా పదోన్నతినిచ్చి కడప జిల్లాలో పోస్టింగు ఇచ్చింది. అక్కడ కూడా జనజాగృతి కార్యక్రమాలను కొనసాగించారు. ప్రజలకు అవగాహన సదస్సులను నిర్వహిస్తూ ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలను మెరుగుపరిచారు.
ప్రజల సమస్యలను సావధానంగా వినేందుకు రోజూ కొంత సమయాన్ని కేటాయించారు. వరదలు సంభవించినపుడు మారుమూల ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు, మందులతో సహా ముందుగా చేరుకునేవారు ఉమేష్‌చంద్ర. బాధితుల సహాయార్థం పోలీసులు తమ వేతనాల్నుంచి విరాళాలిచ్చేలా ప్రోత్సహించారు.
పోలీసులు క్రమశిక్షణగా విధులు నిర్వహించటంలోనే కాదు, వారి కుటుంబాల సంక్షేమానికీ ఉమేష్‌చంద్ర కృషి చేశారు. విధి నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారు. కడప టైగర్‌గా సంభోదించిన వాళ్లూ వున్నారు. సినీ, రాజకీయ నాయకుల తరహాలోనే ఉమేష్‌చంద్రకు అభిమానసంఘాలు ఏర్పడ్డాయి. కరీంనగర్ కు బదిలీ అయినపుడు వీడ్కోలు అభినందసభను ఘనంగా నిర్వహించారు. అక్కడా రాజీపడని పోలీసు అధికారిగా పనిచేశారు. తర్వాత డీజీపీ ఆఫీసుకు స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఏఐజీగా బదిలీ అయ్యారు.
ఆ విధుల్లో ఉండగానే 1999 సెప్టెంబరు 4న హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినపుడు, మావోయిస్టులు ఆయన డ్రైవరు, గన్‌మ్యాన్‌పై కాల్పులు జరిపారు. హ్యాండ్‌గన్ తీసుకెళ్లకుండా బయలుదేరిన ఉమేష్‌చంద్ర, వట్టిచేతులతోనే వారిని వెంటాడారు. పారిపోతున్న మావోయిస్టులు దీనిని గమనించి, వెనుదిరిగి కాల్పులకు దిగారు. ప్రాణభీతితో వెన్నుచూపకుండా పోరాటస్ఫూర్తిని చాటిన ఉమేష్‌చంద్ర ఆ కాల్పుల్లో కన్నుమూశారు. ఆయన స్మారకార్థం హైదరాబాద్‌లో, తెనాలిలో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఉమేష్‌చంద్ర సతీమణి నాగరాణి జిల్లా కలెక్టర్ కాగా, కుమారుడు భరత్‌చంద్ర అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఉన్నారు.
నేడు తెనాలిలో
60వ జయంతి
తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కాల్పులకు బలైన ముగ్గురు పోలీసు అధికారుల్లో చదలవాడ ఉమేష్‌చంద్ర ఒకరు. సూపర్ పోలీస్‌గా పేరుతెచ్చుకున్న ఆ ఐపీఎస్ అధికారి నిండు నూరేళ్ల జీవితం 33 ఏళ్లకే మావోయిస్టుల తుపాకీ గుళ్లకు ముగిసిపోయింది. ఆయన 60వ జయంతిని తెనాలి, హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్నారు. ఉదయం చెంచుపేటలోని ఆయన విగ్రహం వద్ద తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు ఆధ్వర్యంలో పట్టణ, రూరల్ పోలీసులు పుష్పాంజలి ఘటిస్తారు. రాత్రి ఏడు గంటలకు హోటల్ గౌతమ్ కాన్ఫరెన్సు హాలులో జయంతి సభను నిర్వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఏపీ ఐజీపీ ఆకే రవికృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి జి.శ్రీనివాస్, ఉమేష్‌చంద్ర కుటుంబసభ్యులు పాల్గొంటారు. సాహసోపేత ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్రను స్మరించుకుందాం.


