గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో తీసుకొచ్చిన పెన్షన్ వాలిడేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి పి.నాగరాజు తెలిపారు. ఈ రోజును తాము బ్లాక్ డే నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పెన్షనర్లందరికి సమాన హక్కులు ఉండాలన్నారు. జనవరి 1, 2026 ముందు రిటైరైన వారు, తర్వాత రిటైరైన వారిని విభజించి పెన్షనర్లను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పెన్షన్ కమ్యూటేషన్ పీరియడ్‌ను 12 సంవత్సరాలకు తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎన్జీఓ నాయకులు మూర్తి, కోటేశ్వరరావుర, సాయిబాబు, నాగేశ్వరరావు, నాగేంద్రం, సుబ్బారావు పాల్గొన్నారు.


