జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు మెడికల్: క్షయ వ్యాధి (టీబీ) రహిత జిల్లాగా ఆవిర్భవించేందుకు సమష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధికి సరైన సమయంలో పరీక్షలు చేయించుకొని, వైద్యుల సూచనల మేరకు పూర్తి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందన్నారు.
‘టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం’ థీమ్‌తో ఈ సంవత్సరం టీబీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, ఉచిత పరీక్షలు, ఔషధాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ప్రజలు అందరూ టీబీ పట్ల శ్రద్ధ వహించి టీబీ రహిత భారత్ కు, టీబీ రహిత జిల్లాకు సహకరించాలని చెప్పారు.
రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. టీబీ పరీక్షలు, మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయన్నారు.
టీబీ రోగులతో బంధాన్ని కొనసాగించి, త్వరగా నయం కావడానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


