రూ.45 లక్షల నగదు, 41 ఎలక్ట్రికల్ మోటార్లు స్వాధీనం పోలీసుల అదుపులో చోరీకి ఉపయోగించిన వాహనాలు తొమ్మిది మంది నిందితులు అరెస్ట్... పరారీలో ముగ్గురు
మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని ఓ టెక్స్‌టైల్ కంపెనీలో భారీ చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.45 లక్షల 20 వేల నగదుతో పాటు 41 ఎలక్ట్రికల్ మోటార్లు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ మంగళగిరి మండలం చినకాకానిలో ఉన్న మంగళగిరి టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో గత నెల 28న మిషనరీ అపహరించిన ఘటనపై ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన డాక్టర్ గోలి నాగసైనరావుతో పాటు పలువురు స్నేహితులు కలసి 2006లో చినకాకాని గ్రామంలో టెక్స్‌టైల్స్ కంపెనీ నిర్మించారు. కొంతకాలం లాభాల బాటలో నడిచింది. ఆ తరువాత ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల బ్యాంకుకు ఇ.ఎం.ఐలు చెల్లించలేదు. భాగస్వామి ఇమ్మనేని ఈశ్వరరావును రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా బ్యాంకు అధికారులు నియమించారు. అప్పటి నుంచి ఈశ్వరరావు ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 28న మిషనరీ దొంగతనం జరిగిందని గమనించి ఈశ్వరరావు మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
● మైలవరానికి చెందిన గజ్జలకొండ గోపాల్, ఈశ్వరరావుకు తెలిసిన వ్యక్తి కావడంతో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా పలువురిని నియమించారు. గోపాల్‌కు దుర్భుద్ది పుట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ మిషనరీని అమ్ముకుని ఇతర దేశాలకు వెళ్లిపోవాలని గోపాల్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కూలీల సహాయంతో కంపెనీలో ఉన్న మిషనరీని ముందుగా మాట్లాడుకున్న షాపులకు అమ్మేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న గోపాల్ విదేశాలకు పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన తొమ్మిది మందిని మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని కోకో కోలా కంపెనీ వెనుక ప్రాంతంలో ఉన్నారని తెలుసుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 45 లక్షల 20 వేల రూపాయల నగదు, మహేంద్ర బొలెరో, మహేంద్ర స్కార్పియో వాహనాలు, ట్రాక్టర్ ఇంజన్‌తో పాటు 41 ఎలక్ట్రికల్ మోటార్లను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీస్‌బృందాన్ని అభినందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ అవ్వారు వెంకట బ్రహ్మం, ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.


