జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: అర్జీలు రీ–ఓపెన్ కాకుండా శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం ఎస్‌ఆర్‌శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని శాఖల్లో అర్జీలు రీ–ఓపెన్ జరుగుతుందన్నారు. అటువంటి వాటిపై శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
సిబ్బంది అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. లీగల్ కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి జవాబు ఇవ్వాలన్నారు. సరైన కారణాలు లేకుండా అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం వచ్చిన 688 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రత్తిపాడు మండలం కోయావారి పాలెం గ్రామ పరిధిలోని జగన్ కాలనీలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ 71 కుటుంబాలు కూలీనే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్నాయి. రోడ్లు, కాలువలు లేవు. వర్షాలు వస్తే కాలనీ నీటిలో మునిగిపోతుంది. కనీస మౌలిక వసతులు కల్పించాలని మనవి.
– కూరపాటి నిర్మల, తదితరులు,
దళిత బహుజన రీసోర్స్ సెంటర్.
ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ఓబుల్‌నాయుడు పాలెం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమంగా క్వారీ వ్యాపారం చేస్తున్నారు. దీనికి కొందరు ప్రభుత్వాధికారులు కూడా సహకరిస్తున్నారు. స్థానికంగా క్వారీ మాఫియాతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి విచారించి న్యాయం చేయాలని మనవి.
– ఆర్.శివనాగరాజు, ఓబులనాయుడుపాలెం.


