చురుగ్గా ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ | - | Sakshi
Sakshi News home page

చురుగ్గా ఇంటర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

గుంటూరు జిల్లాలో ప్రారంభమైన ప్రక్రియ జనరల్‌, ఒకేషనల్‌ ఆరు సబ్జెక్టుల చొప్పున ప్రారంభం ఆన్సర్‌ షీట్లకు వాల్యూయేషన్‌తోపాటు ‘మార్క్స్‌ ట్యాబ్లేషన్‌’ ఫలితాలను మరింత ముందుగా ప్రకటించేందుకు ఆస్కారం

సబ్జెక్టుల వారీగా వాల్యూయేషన్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగియడంతో విద్యార్థుల ఆన్సర్‌ షీట్‌లకు స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియ వేగవంతమైంది. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో సంస్కృత భాష ఆన్సర్‌ షీట్లకు వాల్యూయేషన్‌ జరుగుతోంది. జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులవారీగా ఆరు సబ్జెక్టుల చొప్పున ఆదివారం వాల్యూయేషన్‌ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు మూల్యాంకన విధులకు హాజరయ్యారు. ఇటీవల ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించి గుంటూరు జిల్లాకు ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల వారీగా 3.50 లక్షలు, ఒకేషనల్‌లో 75 వేల స్క్రిప్ట్స్‌ వచ్చాయి. స్పాట్‌ వాల్యూయేషన్‌ క్యాంపు అధికారి, ఆర్‌ఐవో జి.సునీత పర్యవేక్షణలో తెలుగు, హిందీ, సంస్కృతం, గణితం, సివిక్స్‌, ఇంగ్లిషు సబ్జెక్టులకు సంబంఽధించిన ఆన్సర్‌ షీట్లకు అధ్యాపకులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.

వాల్యూయేషన్‌తోపాటు ‘మార్క్స్‌ ట్యాబ్లేషన్‌’

ఆన్సర్‌ స్క్రిప్టులకు వాల్యూయేషన్‌ చేయడంతోపాటు మార్కుల కేటాయింపు ప్రక్రియ స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలోనే జరుగుతోంది. గతంలో స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను చీఫ్‌ ఎగ్జామినర్లు పరిశీలించిన తరువాత వాటిని ఇంటర్మీడియెట్‌ బోర్డుకు పంపేవారు. ఆ విధంగా బోర్డుకు వెళ్లిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కాన్‌ చేసి విద్యార్థుల రోల్‌ నంబరు, ప్రశ్నపత్రంలో ఇచ్చిన సీరియల్‌ నంబరు, బార్‌కోడ్‌ ఆధారంగా మార్కులను కేటాయించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కానింగ్‌ చేసి మార్కులను కేటాయిడం ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృతమై ఉండటంతో అధికారులకు, ఉద్యోగులకు తలకు మించిన భారంగా ఉండేది. పగలు, రాత్రి విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ మార్కుల వెల్లడిలో జాప్యం నెలకొంటున్న పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం ఈ విధానంలో మార్పులు తెచ్చిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను స్కానింగ్‌ చేసే ‘మార్క్స్‌ ట్యాబ్లేషన్‌’ విధానాన్ని వికేంద్రీకరణ చేసింది. జిల్లాల వారీగా స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రాల్లోనే ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. స్పాట్‌ వాల్యూయేషన్‌ విధులకు హాజరవుతున్న ఎగ్జామినర్లు వాల్యూయేషన్‌ చేస్తున్న స్క్రిప్ట్‌లను అదే రోజు స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. తద్వారా ఇంటర్మీడియెట్‌ బోర్డుకు కొండంత పని భారం నుంచి విముక్తి లభించింది. ఆన్సర్‌ స్క్రిప్ట్‌లకు స్పాట్‌ వాల్యూయేషన్‌ ద్వారా మార్కుల కేటాయింపుతోపాటు అక్కడిక్కడే స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా బోర్డుకు పంపడంతో వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఫలితాలను ఏప్రిల్‌ 11న ప్రకటించే అవకాశం ఉంది.

స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో సబ్జెక్టులవారీగా మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. సబ్జెక్టు నిపుణులను బోర్డులుగా విభజించిన ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్‌ షీట్లకు వాల్యూయేషన్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి బోర్డులో ఒక చీఫ్‌ ఎగ్జామినర్‌తో పాటు ఐదుగురు అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు ఉంటారు. వీరికి అదనంగా బోర్డుకు ఒకరు చొప్పున నియమించిన స్క్రూటినైజర్‌ మూల్యాంకనం చేసిన ఆన్సర్‌ స్క్రిప్ట్‌లను తనిఖీ చేసి, కేటాయించిన మార్కులను పరిశీలిస్తారు. ఈ విధంగా 500 మంది అధ్యాపకులను సంబంధిత విధుల్లో నియమించారు. స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలో విధుల్లో పాల్గొంటున్న అధ్యాపకులకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన అధికారులు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్పాట్‌ వాల్యూయేషన్‌ క్యాంప్స్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement