గుంటూరు రూరల్: జల్సాల కోసం డబ్బులు సులువుగా సంపాదించుకునేందుకు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు... కృష్ణా జిల్లా, గన్నవరం గ్రామానికి చెందిన కత్తి రవికుమార్ గతంలో గుంటూరు, ప్రకాశం, ఏలూరు, కృష్ణా, కర్నూల్ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ చోరీలు చేశాడు. పలు కేసుల్లో అరైస్టె 5 సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు నెలలో జైలు నుంచి వచ్చి మళ్లీ గుంటూరు అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఒక ఇంటిలో రాత్రి పూట బంగారం చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం పలకలూరు రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 5 లక్షల విలువ చేసే బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం స్టేషన్ పరిధిలో చోరీలకు సంబంధించి రూ1.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్‌ఐ మహేష్‌కుమార్, సిబ్బందిని రివార్డు అందజేసి అభినందించారు.


